ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన పారిశుద్ధ్యం

by Disha Web Desk 23 |
ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన పారిశుద్ధ్యం
X

దిశ,బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్య పనులు పడకేసిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో చెత్త చెదారం తో పాటు వీధిలైట్లు కూడా వెలగకపోవడంతో ప్రజలు చీకట్లలో మగ్గుతున్నామని వాపోతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిలు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే గ్రామాలలోకి వస్తుంటారు. కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆయా గ్రామాలలోకి పంచాయతీ కార్యదర్శులు 8.30 గంటల లోపు గ్రామానికి వెళ్ళవలసి ఉండగా సమయపాలన పాటించకుండా ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయం దగ్గరికి చేరుకొని మళ్లీ తిరిగి 12 గంటలకు తిరుగు ప్రయాణం అవుతుంటారు. గ్రామ ప్రజలు తమ అవసరాల నిమిత్తం గ్రామ పంచాయతీ సెక్రటరీ సమయానుగుణంగా లేకపోవడంతో గ్రామాల ప్రజలు మళ్లీ మండల కేంద్రానికి రాక తప్పడం లేదని ప్రజలు అంటున్నారు.

గ్రామానికి చేరుకున్న కార్యదర్శులు ఆఫీస్ లో మాత్రమే కాలయాపన చేసి తిరిగి వెళ్లడంతో ఆయా కాలనీలలో చెత్త చెదారం తో పాటు డ్రైనేజీలు నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. మురుగును ఆవాసంగా చేసుకొని దోమల బెడద ఎక్కువై రోగాల బారిన పడుతున్నామని ఇంటి ముందు నిమిషం ఉండాలంటే ముక్కు మూసుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాత్రి అయ్యిందంటే వీధిలైట్లు వెలగకపోవడంతో డ్రైనేజీలు నిండడంతో వాటిని ఆవాసంగా ఉన్న విష సర్పాలు ఇండ్లలోకి వచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని, రాత్రి సమయంలో బయటకు రావాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో తమకు కేటాయించిన సమయాన్ని గ్రామాల్లో ఉండే విధంగా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed