విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు మన ఊరు మన బడి : కలెక్టర్ కోయ శ్రీహర్ష

by Disha Web Desk 11 |
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు మన ఊరు మన బడి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
X

దిశ, దామరగిద్ద: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు మన ఊరు మన బడి అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) మయంక్ మిట్టల్ తో కలిసి మన ఊరు మన బడి పనులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి మూడు సార్లు గుడ్లు ఇవ్వాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. గడిమున్కన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఏఈని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, నాణ్యమైన బోధన అందించాలని, ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యప్రణాళికను తయారు చేసుకుని బోధించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపితేనే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయని సూచించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన, అభ్యసనకు సంబంధించిన బోధనోపకరణాలు, పాఠ్యప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని కేజీబీవీఎస్ వోను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవం, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలు మన ఊరు-మన బడి పనులు పదిహేను రోజుల్లోగా పూర్తి చేయలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి, జీఈసీవో పద్మ నళిని, ఎంఈవో వెంకటయ్య, ఎంపీపీ నరసప్ప, జడ్పీటీసి లావణ్య రాములు, ఏఈ రఘునందన్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఇన్ చార్జి తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.

మాష్టారుగా మారిన కలెక్టర్

కేజీబీవీ పాఠశాల పదోతరగతి విద్యార్థులతో మమేకమై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు, బోర్డుపై భారతదేశ పటం వేసి రాజధానులను గుర్తింపజేశారు. విద్యార్థులందరూ 10/10 జీపీఏ సాధించేలా చదవాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విట్లపుర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పరీక్షించారు.


Next Story

Most Viewed