- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ఎన్నికల వేళ భక్తిపారవశ్యంలో నేతలు..

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: వినాయక చవితి పండగ అంటే భక్తి భావాలకు పెట్టింది పేరు. పిల్లలు.. పెద్దలు.. కులాలు.. మతాలు అన్న తేడాలు లేకుండా ఆనందంగా జరుపుకునే ఈ పండగకు కొలువుదీరేందుకు వినాయకులే కాదు.. నాయకులు కూడా మండపాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. వినాయకునికి.. నాయకునికి బంధం ఉన్నట్లుగా.. ఈసారి వినాయక చవితి వేడుకలకు ఆరంభమైన ఎన్నికల సందడి మరింత ఉత్సాహాం నింపనుంది. నీతి, న్యాయం, ధర్మం భక్తి కి పెట్టింది పేరు అయిన వినాయకుడికి ఇచ్చే చందాలు.. చేసే పూజలు, తమకు ఉన్న విఘ్నాలను తొలగించి తమకు శుభాలను కలిగించి పదవులు వస్తాయి అన్న ఆశతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు.. ఇతర చోటామోటా లీడర్లు సైతం వినాయక చవితి వేడుకలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. ప్రతిసారి నాయకులు ఈ వేడుకలలో పాల్గొన్నప్పటికీ ఈసారి ఎన్నికల నేపథ్యంలో వచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు
పిలిచి మరీ చందాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహులు తమ వద్దకు చందాల కోసం వచ్చే వారినే కాదు విగ్రహాలను ఏర్పాటు చేసే వారిని గుర్తించి మరి పిలిపించుకొని వారి వివరాలను సేకరించి చందాలు అందజేయడం.. అవసరమైతే విగ్రహాలను కొనివ్వడం చేస్తున్నారు. మరి కొంతమంది నాయకులు మట్టి విగ్రహాలను తయారు చేయించి గ్రామ గ్రామాన పంపిణీ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా వచ్చే ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను నాయకులు చేస్తున్నారు. ఇప్పటికే వినాయక చవితి వేడుకలకు సంబంధించి విగ్రహాల పంపిణీ, చందాల అందజేత కార్యక్రమాలను కొంతమంది నాయకులు పూర్తి చేసుకోగా.. మరి కొంతమంది ప్రతిష్ఠించిన విగ్రహాల వద్దకు వెళ్లి కమిటీ సభ్యులను కలిసి పూజలు చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ప్రచారానికి అవకాశాలు
ఎన్నికలవేళ.. నాయకులకు ప్రచారం చేసుకోవడానికి వినాయక చవితి వేడుకలు ఒక అవకాశం కానున్నాయి. పల్లెలు, పట్టణాలలో వీధి వీధిన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నాయకులు అక్కడికి వెళ్లి ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలతో కలిసి పూజలు చేయడం.. అవసరమైతే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగం పంచుకోవడం వంటివి చేయడం ద్వారా ఓటర్లకు చేరువ కావడానికి సన్నద్ధం అవుతున్నారు. నిమజ్జనం రోజున మరింత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొనే విధంగా ఇప్పటి నుంచి నాయకులు సన్నద్ధం అవుతున్నారు.
నాయకులకు 'బుద్ధి'ప్రసాదించాలి
ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారికి.. కొత్తగా ఎన్నికలలో పోటీ చేయాలి అనుకుంటున్నా వారికి బుద్ధి ప్రసాదించాలి అని ఓటర్లు కోరుకునే పరిస్థితులు నెలకొన్నాయి.. ప్రజలకు నీతిగా, నిజాయితీగా సేవలు అందించవలసిన పాలకులు అంది వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సేవలు అందించే బుద్ధిని కల్పించాలని ప్రజలు వేడుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం అంటే కేవలం పెద్దరికం చేయడం కాదు.. సంపాదించుకోవడం అంతకన్నా కాదు.. అది ఒక బాధ్యతగా గుర్తించి సేవ చేస్తే ఈ 'నాయకులను'వి'నాయకుడు 'గుర్తించి మేలు చేస్తాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పలువురు రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.
సందడే.. సందడి
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పల్లెలు.. పట్టణాలలో సందడి వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేడుకల సందర్భంగా రాజకీయ వేడి మరింత పెరగనుండి. నాయకులు.. వారి అనుచరులు ప్రతి మండపం వద్దకు వెళ్లి పూజలు చేసే సందర్భంగా ఆయా గ్రామాలు.. వార్డులలో తమ సత్తా చాటుకునేందుకు ఫ్లెక్సీలు.. ఏర్పాటుచేసి సన్మానాలను చేయించుకునే విధంగా ముందస్తుగా వ్యూహరచనలు చేసుకుంటున్నారు. ఇలా గణేష్ మండపాలు నాయకులు, వారి అనుచరులతో రద్దీగా మారనున్నది.