KTRను సీఎం చేయడంపైనే KCR ధ్యాస : Amit Shah

by Kalyani |
KTRను సీఎం చేయడంపైనే KCR ధ్యాస : Amit Shah
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్/కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు యువతపై కాకుండా తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం పైననే ధ్యాస పెడుతున్నారు అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఎల్లెనీ సుధాకర్ రావు కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు.

కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు అని ఆరోపించారు. శ్రీశైలం ముంపు బాధితులకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి రైతులను ఆదుకోవడంలోనూ విఫలమయ్యారు అని అమిత్ షా ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే అవినీతి పాలన వస్తోంది. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే మళ్లీ నష్టపోతామని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్ లాంటి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ ఖ్యాతి సాధిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ యాన్ ప్రయోగాలు చేస్తూ ఎప్పటికీ అప్పుడు వైఫల్యం చెందుతుందని పేర్కొన్నారు.

యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. బీసీని ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే జాతీయ రహదారి నిర్మాణం తో పాటు, సోమశిల బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మరో జాతీయ రహదారి నిర్మాణానికి కూడా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మామిడి రైతులను ఆదుకోవడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీల వర్షం గుప్పించారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోతున్న సుధాకర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బీజేపీఅభ్యర్థి సుధాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ వల్ల ఈ నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదు. నన్ను గెలిపిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని, అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావును హర్షవర్ధన్ రెడ్డిని ఇద్దరు దొంగల్ని పక్కనపెట్టి, ఒకసారి బీజేపీ కమలం పువ్వుకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏల్లేని సుధాకర్ తో పాటు బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు రోజా రమణి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మేకల శ్రీనివాసులు, బీజేపీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story