విద్యార్థులకు సరైన పోషణ అందేలా చూడాలి : కలెక్టర్ బీఎం సంతోష్

by Aamani |
విద్యార్థులకు సరైన పోషణ అందేలా చూడాలి : కలెక్టర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల భద్రత, పోషణ, ఆరోగ్య, విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో భద్రత, పోషణ, సాధికారత, ఆరోగ్య శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...గ్రామీణ మహిళలను బలోపేతం చేయడం ద్వారా పిల్లల సమస్యలను సమర్థంగా పరిష్కరించవచ్చని అన్నారు.బాల్య వివాహాల నిరోధం అత్యంత ముఖ్యమని,18 సంవత్సరాలు నిండే వరకు ఆడపిల్లలు, 21సంవత్సరాలు నిండే వరకు మగపిల్లలు వివాహం చేసుకోవద్దనే అవగాహన తల్లిదండ్రులకు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా గట్టు, కేటీదొడ్డి మండలాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను మరింత బలపర్చాలని ఆదేశించారు.

15నుండి 18ఏళ్ల వయస్సు కీలకమైన దశ కావడంతో, ఈ దశలో పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు.10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు మధ్యలో విద్యాభ్యాసం మానేసిన విద్యార్థులు తిరిగి పాఠశాలలు, కళాశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రక్తహీనత (అనీమియా) నివారణ కోసం గ్రామీణ స్థాయిలో రక్తపరీక్షలు నిర్వహించి, విద్యార్థులకు సరైన పోషణ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ మహిళా సంఘాలు ప్రభుత్వ అనుకూల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనిఫామ్ కుట్టడం వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని, గ్రామ స్థాయిలో సక్రమంగా పని చేయాలని, ఉత్సాహంతో చురుకుగా పాల్గొని సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, యూనిసెఫ్ స్టేట్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ, ఏపీడి నరసింహులు, గ్రామ సంఘాల ప్రతినిధులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story