Heavy rain : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం..

by Sumithra |
Heavy rain : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం..
X

దిశ ప్రతినిధి, వనపర్తి : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా భారంగా తిరుగుతున్న మేఘాలు ఒక్కసారిగా వర్షించడంతో భారీ వర్షపాతం నమోదయింది. గంటల తరబడి వాన దంచి కొట్టడంతో వరద నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొరలాయి. ఇదివరకే పంటలు వేసుకొని ఎదురు చూస్తున్న రైతులకు మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షంతో ఊరట లభించినట్లయింది.

గట్టు మండలంలో 12.6 సెంటీ మీటర్ల ...

మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసిన సంగతి తెలిసింది.. అయితే గడచిన 24 గంటల వర్షపాతం పరిశీలిస్తే అత్యధికంగా గద్వాల జిల్లా గట్టు మండలంలో 126 మిల్లీమీటర్లు అంటే 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే రాజోలి మండలంలో 74 మిల్లీమీటర్లు, ఐజలో 60 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా పరిధి అమ్రాబాద్ మండలంలో 69.3 మిల్లీమీటర్లు, తెలకపల్లి 69.0 లింగాల 66.0, బల్మూరు మండలంలో 65.0 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇక మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలో 86.3 మిల్లి మీటర్లు, అడ్డాకుల, దేవరకద్ర మండలాలలో 56 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. అలాగే నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో 82.0 మిల్లీమీటర్లు, మక్తల్ 72.3 , నర్వ మండలంలో 67.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక వనపర్తి జిల్లా కేంద్రంలో 71.0 మిల్లీమీటర్లు, గోపాల్ పేట లో 71.5, కొత్తకోట మండలంలో 67.0 మిల్లీమీటర్ల వాన కురిసింది. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానలు కురవడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.



Next Story