దేశం గర్వించేలా విద్యార్థులు ఎదగాలి : గవర్నర్ తమిళిసై

by Disha Web Desk 13 |
దేశం గర్వించేలా విద్యార్థులు ఎదగాలి : గవర్నర్ తమిళిసై
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులే కాదు దేశం గర్వించేలా ఎదగాలి అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆరుగురు విద్యార్థులకు పీహెచ్ డి, 73 మందికి గోల్డ్ మెడల్స్, పట్టాలను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. 1998లో ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన రోటా వైరస్ వ్యాక్సిన్ మన దేశానికి 2014 నుంచి అందుబాటులోకి వచ్చింది.


1974 నుండి పోలియో వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందుబాటులోకి రాగా మనదేశంలో మాత్రం 2014 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని గవర్నర్ గుర్తు చేశారు. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ముఖ్యమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి సుదీర్ఘ సమయం పట్టిందన్నారు. కానీ ఇటీవల వచ్చిన కరోనా వైరస్ నివారణకు అన్ని దేశాల కన్నా ముందు వ్యాక్సిన్ కనుగొన్న ఘనత మనకి దక్కిందని చెప్పారు. 150 దేశాలకు వ్యాక్సిన్ ను పంపగలిగామన్నారు.. మన దేశంలో ఎంతో ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞులు విద్యార్థులు ఉన్నారు.


జీవితం సవాళ్లతో కూడుకున్నది. ప్రతి ఒక్కరూ ఆ సవాళ్లను స్వీకరించి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు మాత్రమే కాదు. దేశమే గర్వించేలా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని ఆమె సూచించారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా రూపొందించడంలో తల్లిదండ్రులు, అధ్యాపకుల పాత్ర ప్రధానమైందని చెప్పారు. చివరి బెంచి విద్యార్థులు సైతం మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగడానికి సహకరించవలసిన బాధ్యత అధ్యాపకుల పైననే ఉందని చెప్పారు.

తెలంగాణ తల్లి పాలమూరు..

తెలంగాణకు తల్లి లాంటిది పాలమూరు జిల్లా అని గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ అభిప్రాయపడ్డారు. మహబూబ్ నగర్ గా పిలువబడే ఈ ప్రాంతంలో అప్పట్లో పాలు పెరుగు ఎక్కువగా ఉండటం వల్ల పాలమూరు అనే పేరు వచ్చింది. ఇక్కడి ప్రజల శ్రమ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. అందుకే తెలంగాణకు పాలమూరు తల్లి లాంటిది అని గవర్నర్ అభినందించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో హరితహారం కింద మొక్కలు పెద్ద ఎత్తున నాటడం, నాకు గుర్తింపుకు రెండో దశ వెళ్లడం పట్ల ఆమె పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.


సమావేశం అనంతరం రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యూత్ రెడ్ క్రాస్ సొసైటీ, జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ బిజీ రావు, పాలమూరు విశ్వవిద్యాలయం వైద్యాన్సర్ లక్ష్మీకాంత రాథోడ్ పాలమూరు జిల్లా వాసులు కావడం అభినందనీయం అని గవర్నర్ అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ గిరిజ మంగతాయారు, అదనపు కలెక్టర్ సీతారామారావు, అడిషనల్ కలెక్టర్ రాములు, ఆర్డిఓ అనిల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed