క్యాన్సర్ రోగులకు శుభవార్త..

by Disha Web Desk 11 |
క్యాన్సర్ రోగులకు శుభవార్త..
X

దిశ, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఎన్ సీడీ(నాన్ కమ్యూనికబుల్ డీజీసెస్) విభాగం స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ జగన్నాథ్ రెడ్డి, రాష్ర్ట సీవీహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ రెడ్డి మంగళవారం సందర్శించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ రాజ్ కుమార్ తో కలిసి త్వరలో ప్రారంభంకానున్న క్యాన్సర్ డే కేర్ సెంటర్ కు అనువైన స్థలం, అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ గా అదిలాబాద్, వనపర్తి, ఖమ్మం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రులలో నిర్ధారించిన క్యాన్సర్ చికిత్సను, కీమోథెరపీ సెంటర్ లలో ఫాలో అప్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నారని, క్యాన్సర్ రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. కీమోతెరపి డే కేర్ సెంటర్ లో ఒక వైద్యాధికారి, ఇద్దరు స్టాఫ్ నర్స్ లు, జనరల్ ఫిజీషియన్, అనస్థీషియా వైద్యుల సలహాలు, సూచనల మేరకు గుర్తింపబడిన క్యాన్సర్ రోగులకు ఫాలో అప్ ట్రీట్మెంట్ ను కొనసాగిస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎన్సీడీ క్లినిక్ ను, జిల్లా పాలియాటివ్ సేవా కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ హరీష్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎన్ ఎస్ డి సమన్వయకర్త పి సాయి రెడ్డి మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story