ఆయిల్ ఫామ్ కు విదేశాల్లో మంచి డిమాండ్​

by Disha Web Desk 15 |
ఆయిల్ ఫామ్ కు విదేశాల్లో మంచి డిమాండ్​
X

దిశ, అలంపూర్ : ఆయిల్ ఫామ్ పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నదని, ఇక్కడి రైతులు సాగుకు ముందుకు రావాలని, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం అభినందనీయం అని విదేశీ ఆయిల్ ఫామ్​ మార్కెటింగ్ ప్రతినిధులు నికోలస్ (మలేషియా), సిల్వాయిన్ (ఫ్రాన్స్), సరూట్ (థాయిలాండ్) అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల చండూరు గ్రామ శివారులో వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఆయన కూతుర్లు అమృత వర్షిని రెడ్డి, ప్రత్యూష రెడ్డి 70 ఎకరాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ పంటలను మంగళవారం వారు పరిశీలించారు. ఫ్రాన్స్ దేశంకు చెందిన పామ్ మార్కెటింగ్ హెడ్ సిల్వాయిన్, మలేషియాకు చెందిన ఆసియా ప్రతినిధి నికోలస్, థాయిలాండ్ కు చెందిన సర్క్యూట్ పరిశీలించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మంచి ఆయిల్ పామ్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అందులో పొట్టి (ఎత్తు తక్కువ) ఆయిల్ ఫామ్ మొక్క ఎంతో నాణ్యమైనదన్నారు. పలు దేశాల్లో సాగు, మార్కెటింగ్ విధానాలను అధ్యయనం చేశామని చెప్పారు. తెలంగాణ సర్కారు సూచన మేరకు రైతులకు అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చామన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు మంచి లాభాలను పెట్టే ఏకైక పంట ఆయిల్ ఫామ్ మాత్రమేనని వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో 30 వేల నుండి లక్ష ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటలను వేయడం, ఈ పంటలకు కావలసిన విత్తనాలు సబ్సిడీలో అందించడం తెలంగాణ రాష్ట్ర గొప్పతనం అని కొనియాడారు. చండూరు గ్రామంలో పరిశీలించిన పంటలు చాలా అద్భుతంగా ఉన్నాయని, ఈ పంటలే తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

రాష్ట్ర ఆయిల్​ ఫామ్ తోటల టెక్నికల్ కన్సల్టెంట్ వైఎస్ రంగనాయకులు మాట్లాడుతూ అధిక దిగుబడిని ఇచ్చే పొట్టి రకాన్ని ఎకరాకు 57 మొక్కలు 9 మీటర్ల ఎడమతో నాటుకోవాలని సూచించారు. నల్లరేగడి, చౌడు భూములు మినహా ఇతర భూములన్నీ ఈ పంటల సాగునకు అనుకూలమని ఆయన వివరించారు. యూరియా, పొటాష్ ఎరువులు తోటలకు వేసుకోవచ్చునని, చెట్టుకు ముండ్లు ఉండడం వలన కోతులు, పక్షుల బెడద ఉండదన్నారు. మూడు సంవత్సరాల తర్వాత తోట కాతకు వస్తుందని, ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ పంటల్లో అంతర్గత పంటలు పప్పుశనగ, మిర్చి, కందులు వేసుకోవచ్చునని తెలియజేశారు. రైతులు పండించిన ఆయిల్ ఫామ్ పంటలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తారని, ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి దగ్గర ఆయిల్ ఫామ్ పంటలను కొనుటకు ఫ్యాక్టరీ సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధుసుదన్ రెడ్డి ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.



Next Story