ఊరూరా.. శంకర్ దాదాలే.. రోగుల ప్రాణాలతో చెలగాటం

by Dishafeatures2 |
ఊరూరా.. శంకర్ దాదాలే.. రోగుల ప్రాణాలతో చెలగాటం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఊరూరా శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారు. ఎలాంటి అర్హత లేకున్నా వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు, అర్హులైన వైద్యులు, శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా అన్నీ ఉన్నాయి అన్నట్లుగా బోర్డులు పెట్టి రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, స్కానింగ్, డయాగ్నస్టిక్స్ సెంటర్లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చర్యలకు పూనుకుంది.

వారి ఆదేశం మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. గురువారం గద్వాల జిల్లాలో డీఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి ఆరు ఆస్పత్రులను సీజ్ చేయడం విశేషం. అయితే ఎటువంటి అనుమతులు, అర్హతలు లేని వైద్యులు ఆసుపత్రులను మూసుకొని పరారు అవుతున్నారు. మరికొందరు తమ పలుకుబడిని ఉపయోగించుకొని ఇబ్బందులు లేకుండా ప్రజా ప్రతినిధులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

దాడులు ముమ్మరం

ప్రభుత్వ అనుమతులు, అర్హులైన వైద్యులు, శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా అన్నీ ఉన్నట్లుగా బోర్డులు పెట్టి రోగుల జేబులు గుల్ల చేస్తున్న శంకర్ దాదా ఎంబీబీఎస్‌లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలకు పూనుకున్నారు. వీరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, స్కానింగ్, డయాగ్నస్టిక్స్ సెంటర్లపై దాడులు ముమ్మరం చేశారు. అధికారుల దాడిని ముందే పసిగట్టిన కొందరు ఆస్పత్రులను మూసుకొని పరారవుతుండగా మరికొందరు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

జోగులాంబ గద్వాల జిల్లాలో 186 కేంద్రాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార యంత్రాంగం 186 పైగా ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గురువారం జిల్లా వైద్య అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నాలుగు మండలాల్లో ఆస్పత్రులను తనిఖీలు చేశారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆరు ఆసుపత్రులను అధికారులు సీజ్ చేసి, మరికొన్ని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అధికారుల దృష్టికి రాని ఆసుపత్రులు, ల్యాబ్ టెక్నీషియన్ సెంటర్లు మరికొన్ని ఉన్నట్లుగా అధికారులకు గుర్తించారు. ఈ సెంటర్ల నిర్వాహకులు కనీస విద్యార్హతలు, సదుపాయాలు లేకపోయినా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నట్లుగా బోర్డులు తగిలించుకొని ప్రజల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా ఒక వెయ్యికి పైగా ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ టెక్నీషియన్ సెంటర్లు ఉన్నట్లు అంచనా. ఇన్నాళ్లు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు వెలిశాయి . ఈ సెంటర్లన్నింటిలోనూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ఇటువంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరింత తీవ్రతరం కానున్నాయి.

లక్ష రూపాయలు లంచం ఇచ్చాం

జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం తనిఖీలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత మార్చి, ఏప్రిల్ నెలలో ఆయా ఆసుపత్రిలో వైద్య నియామకాలకు సంబంధించి డీఎం అండ్ హెచ్ఓ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని గట్టు తిమ్మప్ప ఆరోపించారు.

తన కూతురుకు సంబంధించి తమ కుటుంబ సభ్యులే లక్ష రూపాయలు ఇచ్చారని తిమ్మప్ప పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని, రెండు మూడు రోజుల తర్వాత సంబంధిత వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. డీఎం అండ్ హెచ్ఓపై చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టనని తిమ్మప్ప చెప్పారు.

తనిఖీలు చేయడం వల్లే

జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర క్లినిక్ సెంటర్లను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని డీఎం అండ్ హెచ్ వో చందు నాయక్ చెప్పారు. నియామకాలు జరిగిన ఆరు నెలల తర్వాత తనపై ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని డీఎం అండ్ హెచ్ఓ అన్నారు.


Next Story

Most Viewed