పీకే నాకంటే తోపు కాదు: మాజీ మంత్రి నాగం కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
పీకే నాకంటే తోపు కాదు: మాజీ మంత్రి నాగం కీలక వ్యాఖ్యలు
X

దిశ, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కేవలం ప్రశాంత్ కిషోర్ (పీకే)ను నమ్ముకునే వ్యూహాలు రచిస్తున్నాయని.. ఎన్నికల వ్యూహరచనలో పీకే నా కంటే తోపు కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎన్నో రకాల ఉప ఎన్నికల్లో కూడా తనకు అపారమైన అనుభవం ఉందన్నారు. కేవలం పీకే సర్వేలు, వారి వ్యూహాలపైనే రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ సొంత పార్టీ నేతలు తిట్టుకోవడం వల్ల బూస్ట్ ఎనర్జీ వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కచ్చితంగా మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రా తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నిండా నీరు ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నీటిని అందించలేకపోతున్నారని.. ఫలితంగా ప్రతిరోజు 20 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 299 టీఎంసీల నీటి వాటా ఉన్న తెలంగాణకు తగిన సదుపాయాలు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేయకుండా.. ఆంధ్ర ప్రాంతంలో నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్టుకు తెలంగాణ మట్టిని వాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కేసరి సముద్రాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని.. దానిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించడంతో పాటు ఎఫ్డీఎల్ పరిధిలో కేసరి సముద్రం చుట్టూరా ఫెన్సింగ్ నిర్మించాలని కోర్టు జిల్లా అధికారులకు ఆదేశించినట్లు నాగం స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి గణతంత్ర వేడుకలకు స్వాతంత్ర వేడుకలకు తేడా తెలియకుండా పోయిందని.. జాతీయగీతం ఆలాపనలో సెల్యూట్ చేయాల్సింది పోయి ప్రతిజ్ఞ చేయడం ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శనం అన్నారు. జిల్లా యంత్రాంగం కూడా ఎమ్మెల్యే చెప్పుచేతల్లోనే పనిచేస్తున్నట్లు తేటతెల్లమయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పీఎసీఎస్ డైరెక్టర్ పాండు, కౌన్సిలర్ నిజాం, కాంగ్రెస్ నేత సలీం తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed