కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలి..ఎందుకంటే..?

by Naveena |
కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలి..ఎందుకంటే..?
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకరాలేని కేంద్ర మంత్రులు,పార్లమెంటు సభ్యులు ఉండి ఏం లాభమని,వెంటనే వారందరూ రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పట్టణంలోని అరుంధతి భవన్లో 'కేంద్ర బడ్జెట్-వివిధ రంగాలపై ప్రభావం' అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరం 50 లక్షల 65 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి శ్రామిక,మధ్యతరగతి,రైతు వ్యవసాయ కూలీలకు శఠగోపం పెట్టిందని,దళిత,గిరిజన,మైనార్టీ,వెనుకబడిన తరగతులకు కూడా బడ్జెట్లో మొండి చేయి చూపిందని ఆయన విమర్శించారు.ఉపాధి హామీకి గత బడ్జెట్ కన్నా 30 కోట్లు తగ్గించి 86 వేల కోట్లు ఇవ్వడం అంటే వ్యవసాయ కూలీలను మోసం చేయడమేనని,30 కోట్ల జనాభా ఉన్న ముస్లింలకు మూడున్నర వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని ఆయన దుయ్యబట్టారు.మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని,రైతాంగానికి కూడా బడ్జెట్లో ఉపశమనం లేదని,మద్దతు ధర,సబ్సిడీ,రుణమాఫీకి ఊరట లేదని,13 నెలలు పోరాడిన ఫలితంగా నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం,ఆకలి చావులను పెంచే రకంగా బడ్జెట్ ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.కార్మిక సంఘాలన్ని 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే,అందుకు ప్రతిపాదనలు లేవని,10 వేల పరిశ్రమలు మూతపడి ఉన్నాయని,వాటి పునరుద్ధరణకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపుల్లో లేదని ఆయన ఆరోపించారు.

విద్య,వైద్యం వ్యాపారంగా మార్చారని,పెట్టుబడిదారులైన కార్పోరేట్లకు ఏడు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించారని,పేదలకు,మధ్యతరగతికి 30 శాతం పన్నులు విధించి దోపిడికి గురి చేశారని ఆయన విమర్శించారు. కార్పొరేట్ల దగ్గరే సంపదంతా కేంద్రీకృతమైందని,బిజెపి మతోన్మాద పార్టీ మాత్రమే కాదని,అది పేద కార్మిక రైతు వ్యతిరేక కార్పొరేట్ల పార్టీ అని ఆయన ఎత్తిపోడిచారు.కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 18,19 తేదీల్లో గల్లీ నుండి డిల్లీ వరకు నిరసనలతో ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదం తెలిపినందుకు సిపిఎం హర్షిస్తుందని,రైతు భరోసా తక్షణం విడుదల చేయాలని,ఇందిరమ్మ ఇళ్లకు అధిక బడ్జెట్ కేటాయించాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానం అమలు పరచాలని,బీసీ జనాభా తగ్గింపు విషయములో స్పష్టత నివ్వాలని,సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్,భూపాల్,వెంకట్ రాములు,రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబెదుల్లా కొత్వాల్,ప్రముఖ న్యాయవాది బెకెం జనార్దన్,రాములు,కిల్లె గోపాల్,నల్లవెల్లి కురుమూర్తి,చంద్రకాంత్,పద్మ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story