ప్రజల కష్టాలు తీర్చేందుకే భరోసా యాత్ర : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Disha Web Desk 11 |
ప్రజల కష్టాలు తీర్చేందుకే భరోసా యాత్ర : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, బిజినేపల్లి : ప్రజల కష్టాలు తీర్చేందుకే భరోసా యాత్ర చేస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. శుక్రవారం బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో బైక్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తుంటారు కానీ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాత్రం కేవలం తన ఆస్థులు కాపాడుకోవడంతో పాటు రెట్టింపు చేసుకునేందుకు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సహజ సిద్ధ వనరులను అక్రమ మార్గాన దోపిడీ చేసి పోగు చేసుకుంటున్నారన్నారు. ఈ విషయాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిచేందుకే బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. వితంతు పెన్షన్లను ఏవో కారణాలతో తొలగిస్తున్నారని అన్నారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి ఎక్కడా అమలు కాలేదని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఈ పథకాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచేందుకు మొగ్గు చూపుతారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి దళిత బిడ్డకు, గిరిజన బిడ్డకు దళిత, గిరిజన బంధు అమలు చేయాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. గిరిజన దళిత బంధు పథకాలు తమ పార్టీ కార్యకర్తలకే ఇస్తామనడం, రెండు మూడు వందల యూనిట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని గంగారం, మహదేవన్ పేట గ్రామాల్లో బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి, కొండ నగేష్, పోల్ దాస్ రాము, జాకీర్ హుస్సేన్, భూషయ్య, తిరుపతయ్య, వెంకటరాములు గౌడ్, దోమ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed