విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

by Disha Web Desk 4 |
విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
X

దిశ, జడ్చర్ల: మరుగున పడిపోయి ఉన్న మన బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం వల్లనే ప్రపంచ గుర్తింపు లభించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రాత్రి జడ్చర్ల సిగ్నల్ వద్ద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి, తదితరులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బతుకమ్మ సంబరాలను ఆరంభించారు.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మహిళలు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి జరుపుకునే ఈ పండగ మన తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ముడివడి ఉన్నప్పటికిని... సమైక్య రాష్ట్రంలో నామమాత్రంగా సాగేవి అని మంత్రి గుర్తు చేశారు. మన రాష్ట్రం. . మన ప్రభుత్వం కావడంవల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బతకమ్మ పండగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు పెద్దన్నగా ఉంటున్నారని, అందుకే బతుకమ్మ చీరల పంపిణీ చేయడంతో పాటు అర్హులైన మహిళలకు పింఛన్లు అందజేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతూ అత్యుత్తమ ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తపనపడే లక్ష్మారెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యే కావడం నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశం అన్నారు.

ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతిరూపం బతుకమ్మ పండుగ అని చెప్పారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వేడుకలను శోభాయమానంగా నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆయన అభినందించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సున్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ. . తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంగా ఉండడంతో పాటు ఆర్థికంగానూ నిలదొక్కుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ గుర్తింపు లభిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. సాగునీటి వనరులు పెరిగి ధాన్యం దిగుబడి ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి కార్యక్రమానికి హాజరైన వారితో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదన కలెక్టర్ సీతారామారావు, జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రవీందర్, డీఈవో రవీందర్,ఎంఈఓ మంజుల, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed