Gadwal Collector : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

by Aamani |
Gadwal Collector :  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నందున అందుకు అనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని వేడుక స్థలం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయ, స్త్రీ శిశు సంక్షేమం, తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రోటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు, ఆర్డిఓ రాంచందర్, అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, ఏఓ వీరభద్రప్ప, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed