చల్లారని అలంపూర్ లొల్లి..!

by Shiva Kumar |
చల్లారని అలంపూర్ లొల్లి..!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పాత్రలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులే పోషిస్తున్నారు. అధికార పార్టీలో అలంపూర్ బీఆర్ఎస్ రాజకీయాలు ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్ రామి రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి మందా జగన్నాథం మధ్య జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచి ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దెబ్బతింటుందన్న ప్రచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చల్లా వెంకట్రాంరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీ పదవి అప్పగించిన విషయం పాఠకులకు విదితమే.

అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికి టికెట్టు ఇచ్చిన గెలిపించుకొని రావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎమ్మెల్సీకి సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో పార్టీలో రెండు గ్రూపులు తయారు అయ్యాయి. ఎమ్మెల్యేకు కాకుండా ఎవరికి టికెట్టు ఇచ్చిన గెలిపిస్తాం అంటూ అధిష్టానానికి ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం అధిష్టానానికి సూచించింది కానీ సిట్టింగులు అందరికీ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ డాక్టర్ అబ్రహంకు కూడా టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ఎమ్మెల్సీ వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదే సందర్భంలో ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథం ఇటీవల తన స్వరాన్ని మరింత పెంచి అధికార పార్టీ తనకు అన్యాయం చేసిందని పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న రోజులలో నా కుమారుడు మంద శ్రీనాథ్ పోటీ చేసి పార్టీ ప్రతిష్టను పెంచారు. మొదటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నించినా.. రెండవసారి పోటీ చేసే అవకాశం నా కుమారుడికి దక్కలేదు.

ఇప్పుడు అవకాశం ఇవ్వండి తప్పకుండా గెలుస్తాం అంటూ జగనాథం డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఎమ్మెల్సీ వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అబ్రహం ఏమాత్రం తొనక కుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నెల 15వ తేదీన అభ్యర్థులతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి తగిన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు అభ్యర్థులు అందరికీ బీఫామ్స్ అందజేయడానికి తేదీ ఖరారు చేసిన నేపథ్యంలో జగన్నాథం తన విమర్శలకు పదును పెట్టారు.

ఎట్టి పరిస్థితిలోనూ ఎమ్మెల్యే గెలిచే పరిస్థితులు లేవు .. మా కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటాం అంటూ పలు సందర్భాలలో ప్రస్తావిస్తున్నారు. ఒక రకంగా అధికార నేతలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆ పార్టీ అభ్యర్థులకు మేలు చేసేలా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సింది పోయి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ విమర్శలు చేయడం పార్టీని దెబ్బతీస్తోంది. ఈ నెల 15న సీఎం కేసీఆర్ సారథ్యంలో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో అభ్యర్థిని మార్పించేందుకు వ్యతిరేకవర్గం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. ఎమ్మెల్యే అబ్రహం మాత్రం ఎన్నికలలో తప్పనిసరిగా గెలిచేది నేనే.. కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి పనులు పనులు తీసుకువచ్చాను. ప్రజలు ప్రజలు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు అండగా ఉన్నారు. మీరు నా గెలుపు కోసం కృషి చేయకున్న కీడు చేయకుండా ఉంటే చాలు గెలిచి తీరుతాం అంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఘంటాపరంగా పదంగా చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో పలు మార్పులు చేర్పులు ఉండడం ఖాయం ఆన్న అభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి.

Next Story

Most Viewed