నన్ను ఆదుకోండి సారూ.. గ్రామసభలో కన్నీటి పర్యంతమైన మహిళ..

by Sumithra |   ( Updated:2025-01-22 08:01:10.0  )
నన్ను ఆదుకోండి సారూ.. గ్రామసభలో కన్నీటి పర్యంతమైన మహిళ..
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : సారు.. నాకు ఇద్దరు పిల్లలు.. నా భర్త చనిపోయిండు.. మా భూములకు సంబంధించి సమస్యలు ఉన్నాయి.. ఇల్లు లేదు.. పింఛను వస్తలేదు.. ఎట్లా బతకాలో.. అర్థం అయితలేదు అంటూ కన్నీటి పర్యంతం అయిన మహిళలకు మేమున్నాం.. అధైర్య పడకండి అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధైర్యం ఇచ్చారు. ప్రజాపాలనలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కపట గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను సభలో మంత్రి, ఎమ్మెల్యే ముందు చెప్పుకున్నారు. గ్రామానికి చెందిన దాసర్ల శాంతి అనే మహిళ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త ఆరేండ్ల కిందట మరణించాడు. భూములకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. ఇల్లు లేదు.. రేషన్ కార్డు లేదు.. బతకడం కష్టంగా ఉంది సారు.. ఎట్లాగైనా కాపాడండి అనే కన్నీటి పర్యంతం కాగానే మంత్రి దామోదర రాజనర్సింహ కల్పించుకొని తప్పకుండా తగిన న్యాయం చేస్తాం.. పిల్లల చదువు కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కురువ కొండమ్మ అనే మహిళ మాట్లాడుతూ మాకు 1,50,000 రూపాయల రుణమాఫీ అయ్యింది సారు.

ఇల్లు లేదు.. మీరు ఇల్లు ఇస్తే కట్టుకుంటాం అని చెప్పగానే అర్హులకు తప్పకుండా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సరోజమ్మ అనే మహిళ మాట్లాడుతూ నా కొడుకు, బిడ్డ పెళ్లిళ్లు అయిపోయాయి.. బతుకుదెరువు కోసం వేరే వేరే చోట్ల ఉంటున్నారు. నా భర్త అనారోగ్యంతో మంచం పట్టాడు. పింఛన్ వస్తలేదు. ఇట్లాగైనా మాకు మేలు చేయండి సార్ అని వేడుకోగా.. నీ భర్తకు వైద్య సేవలు అందించడంతో పాటు.. ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బంగారి మంజుల అనే మహిళ నా భర్త చచ్చిపోయే ఐదేళ్లు అవుతుంది.. ఉన్న ఇంటికి పోవడానికి దారి లేదు. ఇల్లు కట్టుకొనికే స్థలం లేదు. పింఛన్ వస్తలేదు ఎట్లాగైనా నాకు న్యాయం చేయండి సార్ అనగానే.. అక్కడే ఉన్న అధికారులు.. స్థానిక ప్రజా ప్రతినిధులను ఈమెకు న్యాయం చేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వితంతు పింఛన్లు మంజూరికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బోయ రంగమ్మ అనే మహిళ సార్ మాకు ఉన్న గుడిసె కాలిపోయింది.

ఉండడానికి ఇల్లు లేదు. అని చెప్పగానే తప్పకుండా సాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. జ్ఞానేశ్వర్ అనే వికలాంగుడు మంత్రి వద్దకు చేరుకొని తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని సభలో విజ్ఞప్తి చేశాడు. అక్కడ ఉన్న కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి కల్పించుకొని తక్షణము ట్రై సైకిల్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు. గంటలోపు అతడికి డ్రై సైకిల్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇంకా పలువురు తమకు రేషన్ కార్డులు, ఇండ్లు, పింఛన్లు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా.. అందరి సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కెసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ గౌడ్, మాసా గౌడ్, అన్వర్ పాష,రామ్ రెడ్డి, లిక్కి విజయ్, వేణు, చంటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed