ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 21 |
ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/నవాబ్ పేట : ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. ఆ తల్లితోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఆపై పెద్ద కూతురు ప్రాణాలతో బయటపడిన సంఘటన శనివారం సాయంత్రం నవాబుపేట మండలం కాకర్లపహడ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

కాకర్లపహడ్ గ్రామానికి చెందిన అద్దాల మైబయ్య, రమాదేవి (35) దంపతులు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌‌‌కు వలసవెళ్లి అక్కడే కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు నవ్య దేవరకద్ర గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నది. ఈ క్రమంలో పెద్దల పండగ చేయాలి అని భర్తకు చెప్పి రమాదేవి తన మరో కూతురు చందన (4), కుమారుడు మారుతి (4) కవల పిల్లలను వెంట తీసుకొని నేరుగా పెద్ద కూతురు వద్దకు వెళ్లి.. ఆమెను కూడా తీసుకొని ఆర్టీసీ బస్సులో గ్రామానికి పయణమైంది. గ్రామ సమీపంలోని బస్సులో నుండి పిల్లలతోపాటు దిగిన ఆమె అప్పటికే సాయంత్రం చీకటి పడటంతో గ్రామానికి కాకుండా సమీపంలో ఉన్న ఓ చెరువు వద్దకు పిల్లలను తీసుకువెళ్లింది.

అప్పటికే చీకటి పడిన విషయం గమనించిన పిల్లలు ఒకింత సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ.. తల్లి వారికి పలు రకాల మాటలు చెబుతూ చెరువు వద్దకు తీసుకువెళ్లింది. పెద్దకూతురు నీళ్లలో మునిగిపోతాం అని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా తన ముగ్గురు పిల్లలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తల్లి రమాదేవి, కూతురు చందన, కుమారుడు మారుతి నీళ్లలో మునిగిపోగా.. పెద్దకూతురు నవ్యకు ఒక కంప చెట్టు దొరకడంతో ఆ చెట్టును పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. సమీప పొలాలలో వ్యవసాయ పనులు ముగించుకొని అటుగా వెళుతున్న గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నవ్య ఏడుపులు విని అక్కడికి చేరుకున్నాడు. విషయన్ని గమనించి వెంటనే గ్రామంలోకి వెళ్లి మరికొందరిని తీసుకొచ్చి.. టార్చ్ లైట్ వెలుగులో ప్రాణాలతో ఉన్న నవ్యను బయటకు తీశారు.

అప్పటికే మిగతా ముగ్గురు నీళ్లలో మునిగిపోయారు. ఆ విషయాన్ని గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా పెద్ద కూతురు జరిగిన సంఘట గురించి కన్నీరు, మున్నీరవుతూ వివరాలను వెల్లడించింది. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు సైతం చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. చీకటిగా ఉండడం.. పైగా చెరువులో కంప చెట్లు ఉండటం వల్ల మృతదేహాలను వెతికి వెలికి తీయడానికి వీలుపడలేదు. ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. కాగా రమాదేవి తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియవలసి ఉంది. ఈ సంఘటనతో కాకర్లపహడ్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed