పాలమూరు గడ్డమీద వికసించేది కమలం పువ్వే : ఈటెల రాజేందర్

by Disha Web Desk 11 |
పాలమూరు గడ్డమీద వికసించేది కమలం పువ్వే : ఈటెల రాజేందర్
X

దిశ, మహబూబ్ నగర్ / హన్వాడ : తెలంగాణ రాష్ట్రానికి కాపాల కుక్కల ఉంటా అన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నేనే ఓనర్ అని అంటున్నాడని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కు కర్రు కాల్చివాతపెడతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని బొంద పెట్టాలనేదే తెలంగాణ ప్రజల మనోగతం అని అన్నారు. సోమవారం మహబూబ్నగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కు బీజేపీ పార్టీ మహబూబ్నగర్ అభ్యర్థి మిథున్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీశ్రేణులు ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… గడచిన పదేళ్లలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడని పుట్టే ప్రతి బిడ్డ మీద లక్ష ఇరవై వేల రూపాయల చేశాడని ఆ అప్పును ఎవరి స్వార్థ ప్రయోజనాల కొరకు చేశాడో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అన్ని పార్టీలను చూసాం చూడాల్సిన మోడీని బీజేపీ పార్టీని చూద్దామని తెలంగాణ ప్రజల అనుకుంటున్నారని ముమ్మాటికి తెలంగాణ గడ్డమీద మహబూబ్నగర్ గడ్డమీద వికసించేది కమలం పువ్వేనని అన్నారు. మంత్రిగా ప్రజాసేవ చేయడం అంటే భూములు ఆక్రమించుకోవడం కాదు, బెదిరింపులకు పాల్పడడం కాదు, దౌర్జన్యాలకు దిగడం కాదని, కిడ్నాప్లు చేయడం కాదు అని మండిపడ్డారు. నిరుపేదల పక్షాన నిలబడడం, సంక్షేమాలను నిరుపేదలకు అందించడమని స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుద్దేశించి ఈటెల రాజేందర్ అన్నారు.

పెన్షన్ ఇవ్వక పోవడానికి కేసీఆర్ అబ్బ జాగీర్ కాదని 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని ఇవ్వలేదని, భర్తలు చనిపోయి రెండేళ్లయిన పెన్షన్లకు దిక్కు లేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్లు వాళ్ల కార్యకర్తల బంధువులకు భైరవికారులకు ఇప్పించుకున్నారు తప్ప పేదవారికి ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ముసలి వాళ్లు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామని పేదలందరికీ సంక్షేమ పథకాలు పెన్షన్లు అందిస్తామని అన్నారు. కేసీఆర్ కు రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇచ్చే సోయి లేదు కానీ మళ్లీ అధికారం అప్పగిస్తే సన్న బియ్యం ఇస్తానని మభ్యపెడుతున్నాడని అన్నారు.

కేసీఆర్ పోతేనే పెన్షన్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉచిత సిలిండర్లు వస్తాయని, కేసీఆర్ మనకు తెలవకుండానే రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లు నెలకి వచ్చేలా చేశాడని విమర్శించారు. తెలంగాణ బాగుపడాలా లేక అనేది ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. మిథున్ రెడ్డి ఎమ్మెల్యే అవుదాం అనుకునేది దౌర్జన్యం చేయడం కోసం భూముల ఆక్రమించడం కోసం ఓటు వేయమని అడగడం లేదని వాటిని అడ్డుకోవడం కొరకే మీ ఆశీర్వాదం కై వచ్చాడని మిథున్ రెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే అన్నారు. నిర్భయంగా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఎప్పటికైనా ధర్మమే శాశ్వతం అని ఈ నడుమంతరపు సిరిలు కాదని, నెల 30న ప్రజలు ధర్మం వైపు ఉంటూ బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి

ధర్మానికి ఆ ధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల్లో ప్రజలు ధర్మము వైపే ఉంటూ అధర్మం, అక్రమాలు, దౌర్జన్యాలు,బెదిరింపులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో బీజేపీ పార్టీకి ఓటు వేసి తన కుమారుడు మిథున్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ప్రజలు, కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని మిథున్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. పాలమూరులో బీజేపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని జితేందర్ రెడ్డి అన్నారు.

పాలమూరు ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు

మహబూబ్నగర్ అసెంబ్లీ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని గడిచిన పదేళ్ల నుంచి ఆ స్వేచ్ఛను కోల్పోయిన మని, అనేక ఇబ్బందులు పడుతూ భయం భయంతో తమ జీవనం కొనసాగిస్తున్నారని, ఆ స్వేచ్ఛ జీవనశైలి తిరిగి రావాలంటే కేవలం బీజేపీ పార్టీ గెలిస్తేనే అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, కిడ్నప్ లు బంద్ అవుతాయన్నారు. తమకు స్వేచ్ఛ లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారని, పాలమూరు ప్రజలు కోరుకున్న స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రజల పక్షాన్ని అంటూ ప్రజల సేవకై ఎంతవరకైనా పోరాడుతానని ఒక్క అవకాశం ఇవ్వాలని ఈనెల 30న కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని మిథున్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

జడ్చర్ల/ వెల్దండా : జడ్చర్ల వెల్దండలో ఎన్నికల ప్రచారంలో ఈటెల

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జడ్చర్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి లకు మద్దతుగా బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చెప్పే మాటలకి చేసే పనికి పొంతన లేని వ్యక్తి కేసీఆర్ అని, అల్లుడు వస్తే డబుల్ బెడ్ రూమ్ లో పడుకోవాలని అన్నాడు. కానీ డబుల్ బెడ్ రూమ్ లా ఊసే లేదని పెద్దవా చేశారు. తెలంగాణలో కవులు రైతులు చనిపోతే రూపాయి ఇవ్వలేదు కానీ, పంజాబ్లో రైతులు చనిపోతే లక్ష రూపాయలు ఇవ్వడానికి చేతులు ఎలా వచ్చాయని ఎవరబ్బా సొమ్ము అని ఇచ్చావు అని ప్రశ్నించారు. కేసీఆర్ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, పేదల పక్షాన నిలబడే బీజేపీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి, సామల నాగరాజు, ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Next Story