మేడిగడ్డ మరమ్మతుకు ఎల్ అండ్ టీ ఓకే.. కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌ చర్చలు

by Shiva |
మేడిగడ్డ మరమ్మతుకు ఎల్ అండ్ టీ ఓకే.. కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌ చర్చలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీకి ఏర్పడిన లోపాలను చక్కదిద్దేందుకు ఎట్టకేలకు ఎల్ అండ్ టీ కంపెనీ ఒప్పుకున్నది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గురువారం జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆ కంపెనీ తరఫున ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై అనేక విషయాలను చర్చించారు. కంపెనీ తన సొంత ఖర్చుతో రిపేర్ పనులను చేయడానికి సమ్మతి వ్యక్తం చేసింది. ఏయే పనులు చేయాలనే అంశంపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన మధ్యంతర నివేదికలో స్పష్టత ఇచ్చింది. వాటికి అనుగుణంగా ఎల్ అండ్ టీ కంపెనీ ఈ పనులను టేకప్ చేయనున్నది. రాబోయే వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పనులకు ఆటంకం లేకుండా అప్పటివరకు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను మొదలుపెడితేనే సాధ్యమని వివరించారు. దీంతో శుక్రవారం నుంచే పనులు మొదలుకానున్నాయి.

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల డిజైన్లు కూడా ఒకే తరహాలో ఉన్నాయని పేర్కొన్న ఎన్డీఎస్ఏ, ఆ రెండింటిలోనూ కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని తన ఇంటెరిమ్ రిపోర్టులో వ్యాఖ్యానించింది. నీటి బుంగలు ఏర్పడడంతో పాటు బ్యారేజీ పిల్లర్ల బేస్‌మెంట్ కింద ఇసుక తొలగిపోయిందని కూడా కొన్ని ఉదాహరణలను ప్రస్తావించింది. వీటన్నింటి కారణంగా మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయరాదని, వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేయాలని, మొత్తం గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని సిఫారసు చేసింది. పిల్లర్లకు పగుళ్ళు రావడం, భూమిలోకి కుంగిపోయిన నేపథ్యంలో వెంటనే చేపట్టాల్సిన పనులపైనా టెక్నికల్ అంశాలను ప్రస్తావించి సూచనలు చేసింది. పిల్లర్లకు పగుళ్ళు వచ్చి కుంగిన చోట గేట్లను ఎత్తడానికి వీలు పడకపోతే వాటిని పూర్తిగా తొలగించి కొత్తవాటిని అమర్చాలని కూడా క్లారిటీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఆ రిపేర్ పనులను వెంటనే టేకప్ చేయడానికి మూడు కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఏజెన్సీల నిపుణుల నుంచి అభిప్రాయాలను తీసుకుని వాటికి అనుగుణంగా ఎన్డీఎస్ఏ సూచించిన రిపేర్ పనులను మొదలుపెట్టడంపై మంత్రివర్గం ఇటీవల లోతుగా చర్చించింది. అందులో భాగంగా పూణె నుంచి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చి స్టేషన్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చి స్టేషన్, నేషనల్ జియాలజీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ నిపుణులను రంగంలోకి దించింది రాష్ట్ర ప్రభుత్వం. పూణె నుంచి రాష్ట్రానికి చేరుకున్న నిపుణులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్యామేజీకి దారితీసిన కారణాలను విశ్లేషించారు. అప్పటికే విజలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ, ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ చేసిన అధ్యయనం రిపోర్టులను కూడా స్టడీ చేశారు. అధ్యయనంలో తేలిన అంశాలన్నింటినీ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ అధికారులతో గురువారం సమావేశమై వివరించారు.

ఎన్డీఎస్ఏ చేసిన సిఫారసుల మేరకు ఎల్ అండ్ టీ కంపెనీ వెంటనే పనులను మొదలుపెడితే ఎన్ని రోజులు పడుతుందనే అంశమై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానున్నది. దీనికి తోడు సాయిల్ టెస్ట్, పిల్లర్ల కింద ఫౌండేషన్ స్టెబిలిటీ తదితర అంశాలపైనా ఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన నిపుణులు ఒక అంచనాకు రానున్నారు. జియో ఫిజికల్, జియో టెక్నికల్ అంశాలపై నిశితంగా స్టడీ చేసిన తర్వాత తగిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. వీటిని కూడా ఎల్ అండ్ టీ కంపెనీ పరిగణనలోకి తీసుకుని మరమ్మత్తు పనులను అందుకు అనుగుణంగా చేపట్టనున్నది. ఒకవైపు పనులు జరుగుతుండగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అక్కడకు వెళ్ళి తాజా పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకోవడంతో పాటు ఎల్ అండ్ టీ కంపెనీ చేస్తన్న రిపేర్ పనులపైనా ఆరా తీయనున్నారు.

నిజానికి మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్ పనులు చేయడానికి తొలుత ఎల్ అండ్ టీ కంపెనీ నిరాకరించింది. తమకు సంబంధం లేదని, ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కామెంట్ చేసింది. దీన్ని బలపరుచుకునే తీరులో బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభోత్సవం కూడా జరిగిందని, ఫంక్షనింగ్‌లోకి వచ్చిందని, నీటిని లిఫ్ట్ చేయడం కూడా జరిగిందని వ్యాఖ్యానించింది. చివరకు ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపుల అనంతరం సొంత ఖర్చుతో ఎల్ అండ్ టీ ముందుకు రాక తప్పలేదు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి ఆదేశించడమే కాకుండా వారం రోజుల వ్యవధిలోనే సీఎంతో కలిసి అక్కడకు వస్తామని చెప్పడం గమనార్హం. పనులు చేసే సమయానికే వరద వచ్చే పరిస్థితి ఉత్పన్నమైతే తీవ్రతను తగ్గించేలా బ్యారేజీ ఎగువ ప్రాంతంలో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని కూడా మంత్రి సూచించారు.

Next Story

Most Viewed