అగ్రవర్ణాల రాజ్యం కొనసాగితే బతుకులు మారవు: గద్దర్

by Disha Web Desk 11 |
అగ్రవర్ణాల రాజ్యం కొనసాగితే బతుకులు మారవు: గద్దర్
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: అగ్రవర్ణాల రాజ్యం కొనసాగినంత కాలం అణగారిన వారి బతుకులు మారవని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అంబేడ్కర్ జాతర బహిరంగ సభను జాతర కమిటీ అద్యక్షడు మహేష్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సుభాష్ రోడ్ బారం బావి నుంచి పుర వీధుల గుండా అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజా గాయకుడు, ప్రజా యుద్ద నౌక గద్దర్ మాట్లాడుతూ బడుగు బలహీనర్గాల ప్రజలు విద్యావంతులు కావాలని చైతన్యంతో రాజ్యాధికారం లాక్కోవాలని పిలుపునిచ్చారు.

అణగారిన బడుగుల సంస్కృతి సాంప్రదాయాలను అగ్రవర్ణాల వారు తొక్కి పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీనర్గాలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులు అందడం లేదన్నారు. ఆడబిడ్డ లేనిదే ప్రపంచం లేదన్నారు. సమస్యలు ఎదురైతే సమ్మక్క, సారక్కలుగా మారి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా ఆడజన్మ గొప్పతనం తెలిపే నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి అంటూ సభా ప్రాంగణంలో గద్దర్ ఆడి పాడిన ఆటపాట పలువురిని కలచివేసింది. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీ ఖాసిం, సతీష్ బైరెడ్డి, చంద్రశేఖర్, లింగం, గవినోళ్ల శ్రీనివాస్, బలరాం, రమేష్, హన్మంత్, కాశీనాథ్, ఈశ్వరి, హజమ్మ, చంటి, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story