ఫ్లాష్.. ఫ్లాష్.. మందు బాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాక్

by Disha Web |
ఫ్లాష్.. ఫ్లాష్.. మందు బాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న సర్కారుకు లిక్కర్ ను ప్రత్యామ్నాయ మార్గంగా తీసుకుంది. మద్యం ధరలను ఉన్నఫళంగా పెంచింది. బుధవారం అర్థరాత్రి వరకు పెంచిన ధరలను రహస్యంగా పెట్టింది. ఇదే క్రమంలో మద్యం దుకాణాలు అత్యవసరంగా మూసివేయాలని ఆదేశించింది. ఆబ్కారీ శాఖ అత్యవసరంగా ఫోన్​ సమాచారం ఇవ్వడంతో.. మద్యం దుకాణాలకు తాళాలు వేశారు. ఒక్కో దుకాణం వద్దకు వెళ్లి నిల్వలను లెక్కించి సీలు వేశారు. గురువారం నుంచి పెరిగిన ధరల ప్రకారం మద్యాన్ని విక్రయించాలని సూచించారు.

బీరుపై రూ. 20

పెరిగిన మద్యం ధరలు బుధవారం రాత్రి బయటకు వచ్చాయి. అయితే, వీటిని అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అన్ని రకాల బీర్లపై రూ. 20 చొప్పున పెంచారు. అదే విధంగా లిక్కర్​ క్వార్టర్​ పై 20, ఆఫ్​ బాటిల్​ పై రూ. 40, ఫుల్​ బాటిల్​ పై రూ. 80 వరకు పెంచుతున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని బ్రాండ్ల మద్యానికి సంబంధించి ఫుల్​ బాటిల్​ పై కొంత ఎక్కువ ధర ఉండే అవకాశం కూడా ఉంది. దీనితో పాటుగా విదేశీ మద్యంపై మాత్రం 20 శాతం పైమేరకు ధరలు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

మద్యం ధరలు పెంచుతున్న నేపథ్యంలో ఇప్పటికే మద్యం దుకాణాలకు స్టాక్‌ను తగ్గించారు. ధరల పెంపు ఉత్తర్వులు వెలువడేంత వరకు అమ్మకాలు కూడా నిలిపివేయాలని బుధవారం రాత్రి అత్యవసర సమాచారమిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రూ. 30వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. దానిలో ప్రభుత్వానికి ట్యాక్స్‌ల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 12 వేల కోట్లుగా ఉంది. ఇప్పుడు అమ్మకాలను పెంచడంతో పాటుగా ధరలు కూడా పెంచితే.. ఈసారి 15వేల కోట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది.

లిక్కరే దిక్కు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వం కష్టాలు పడుతోంది. ఉద్యోగుల జీతాల కోసం కూడా తండ్లాడుతోంది. కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​తో పాటుగా పలు సంస్థల్లో ఇంకా జీతాలు సర్దుబాటు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి లిక్కర్​ మాత్రమే ఏడారిలో ఓయాసిస్సులా కనిపిస్తోంది. మద్యం ధరలను పెంచితే కొంత ఆదాయం పెరుగుతుందని లెక్కలు వేసింది. ఇప్పటికే మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌గా నిలుస్తోంది. ఏటేటా విక్రయాలు పెరుగుతున్నాయి. ఆబ్కారీ శాఖ అధికారులు కూడా కల్తీ, గంజాయి, సారా వంటి వాటిని అరికట్టడం మానేసి.. మద్యం విక్రయాల పెంపుపైనే పని చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఆదాయం చాలదన్నట్లు ధరలను మరింత పెంచి మద్యం ప్రియుల నడ్డీ విరవడానికి సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్యాన్నే ప్రభుత్వ ఆదాయ వనరుగా గుర్తింస్తుండటంతో.. ధరల పెరుగుదల తప్పలేదు.

Next Story