ఏసీబీ డీఎస్పీ పేరిట ఫోన్.. రెండు శాఖల్లో కలకలం

by Disha Web |
ఏసీబీ డీఎస్పీ పేరిట ఫోన్.. రెండు శాఖల్లో కలకలం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హలో సార్ నమస్కారం చెప్పండి సార్ అంటూ ఆ ఎస్సై గుర్తుతెలియని నెంబర్ నుండి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నాను నేను మీ తహశీల్దార్ కు కాల్ చేస్తానని చెప్పండి అని ఆర్డర్ వేసింది అవతలి నుండి మాట్లాడిన ఓ గొంతు. అలాగే సార్ అంటూ ఫోన్ పెట్టేసిన ఎస్సై వెంటనే సంబంధిత తహశీల్దార్ కు ఫోన్ లో సమాచారం చేరవేశారు. తహశీల్దార్ ఫోన్ కట్ చేయగానే మ‌రో నెంబర్ నుండి ఫోన్ రింగయ్యింది. లిఫ్ట్ చేయగానే అవతలి కంఠం సీరియస్ వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డావని రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల నెంబర్ ఇవ్వండి అని అడిగి వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడింది అవతలి గొంతుక. మీ తహశీల్దార్ ను అరెస్ట్ చేశాం.. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మీరెవరూ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మేం తప్పు చేయనప్పుడు డబ్బులు ఎందుకివ్వాలి అన్న ప్రశ్నల పరంపర కొనసాగించడంతోపాటు ఏసీబీ అధికారుల వలే మీ తీరు లేదని అనుమానం వ్యక్తం చేశారు. అంతే అవతలి నుండి ఫోన్ కట్ అయ్యింది. ఇలా జగిత్యాల జిల్లాలోని పలువురు ఎస్సైలకు, తహశీల్దార్ లకు ఆగంతకులు కాల్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. డబ్బులిస్తావా? జైలుకు వెళ్తావా అంటూ ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులం రావడంతో జిల్లా అధికారులు అయోమయానికి గురయ్యారు. మొదట ఏసీబీ డీఎస్పీనే కాల్ చేసి ఉంటాడని అనుమానించినప్పటికీ ఆ తర్వాత తేరుకున్నారు.

ట్రూ కాలర్ లో మరో పేరు వచ్చిందని ఓ తహశీల్దార్ ప్రశ్నిచడంతో ఫోన్ కట్ చేయడంతోపాటు డబ్బులు సిద్ధం చేసుకోండి మీరు కాల్ బ్యాక్ చేయొద్దు మళ్లీ తానే చేస్తానని అనడంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూరింది. ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గంలోని పలువురు అధికారులకు ఈ కాల్స్ వచ్చినట్టు సమాచారం. అయితే అది ట్రూ కాల్ కాదని ఫేక్ కాల్ అని పోలీసులు అంటున్నారు. అగంతకుడు బెంగళూర్ నుండి మాట్లాడినట్టు పోలీస్ వర్గాలు ప్రాథమిక నిర్థారణకు వచ్చాయి.

Next Story