లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్‌రెడ్డి: కేటీఆర్

by Disha Web Desk 2 |
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్‌రెడ్డి: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమన్నారు. మహారాష్ట్ర, అసోం రాష్ట్రాల్లో జరిగినట్లుగా తెలంగాణలోనూ అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయన్నారు. పరోక్షంగా ఏక్‌నాథ్ షిండే ఘటనలు రిపీట్ అవుతాయన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి మొదలు సిరిసిల్లలోని కేకే మహేందర్‌రెడ్డి వరకు కాంగ్రెస్‌లో అందరూ దగుల్బాజీలు, సన్నాసులే ఉన్నారని కామెంట్ చేశారు. రైతులకు సాగునీరు, మంచినీళ్ళు ఇవ్వడం చేతకాని రాష్ట్ర ప్రభుత్వం గత పాలనలోని అంశాలను తెరపైకి తెచ్చి కేసీఆర్‌ను బదనాం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. కేసులకు, జైళ్లకు భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటామన్నారు.

సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో గతంలోనే మంజూరైన రూ. 14 కోట్ల రోడ్డు పనుల్ని ర‌ద్దు చేయ‌డానికి బదులు సీఎం రేవంత్‌కు దమ్ముంటే ప్‌్జ‌ల మ‌న‌సు గెలుచుకోవాలన్నారు. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వ‌ర‌కు బీఆర్ఎస్ హయాంలో రెండు లేన్ల రోడ్డు మంజూరు చేశామని, ఇప్పటి ప్రభుత్వానికి చేత‌నైతే దాన్ని నాలుగు లేన్ల మార్చాలన్నారు. గత ప్రభుత్వంమీద కక్ష తీర్చుకునే ఉద్దేశంతో బ‌తుక‌మ్మ చీర‌ల ఆర్డ‌ర్లు ర‌ద్దు చేశారని, కేసీఆర్ మీద కోపంతో చిల్ల‌ర రాజ‌కీయాలకు పాల్పడుతూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు వేస్ట్ అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ నెల 12వ తేదీన క‌రీంన‌గ‌ర్‌లో క‌ద‌న భేరి బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చి వంద రోజులు కావస్తున్నా రైతుల‌కు రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయ‌లేదని, గత ప్రభుత్వంలో అమలైన రైతుబంధు సాయాన్నీ ఇవ్వలేదని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్‌పై రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ధ‌ర్నాలు చేస్తున్నామని, ఇందులో ప్రజలు విస్తృతంగా పాల్గొంటారని, కలెక్టర్లకు మెమొరాండంలు అందజేస్తామన్నారు.

Read More..

‘జెంటిల్‌మేన్’ సీఎం రేవంత్ రెడ్డి! ఏబీవీపీ సంస్కారం.. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఆసక్తికర వ్యాఖ్యలు

Next Story