సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

by Disha Web Desk 2 |
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఎన్నికపై హైడ్రామా నెలకొంది. తీవ్ర ఉత్కంఠ మధ్య రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం రాత్రి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో ఈ పదవి కోసం ఎన్నికపై వాడీ వేడీ చర్చలు సాగాయి. పోటీలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావుల పేర్లు వినిపించాయి. అయితే, తనకు మరోసారి అవకాశం కల్పించాలని ప్రస్తుత కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ముగింపు సందర్భంగా శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో ఎన్నిక వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాత్రి 11 గంటల వరకు ఉత్కంఠ భరితంగా సాగిన చర్చల్లో రాష్ట్ర కార్యదర్శిగా చాడ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరగా ఈ సారి ఆ ఛాన్స్ తనకు ఇవ్వాలని కూనంనేని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ అనివార్యం అయింది.


ఈ నేపథ్యంలో చాడ వెంకట్ రెడ్డి జోక్యం చేసుకుని ఎకగ్రీవమైతేనే తాను కొనసాగుతానని ఒకవేళ పోటీ అనివార్యం అయితే, పల్లా వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక్కడ చాడ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తనకు అవకాశం దక్కని పక్షంలో పల్లాకు ఆ అవకాశం ఇవ్వాలనడం వెనుక కూనంనేనిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కూనంనేని, పల్లాల మధ్య ఓటింగ్ అనివార్యం అయింది. ఇందులో కూనంనేని సాంబశివరావు కు 59 ఓట్లు, పల్లా వెంకట్ రెడ్డికి 45 ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మహాసభలు ప్రకటించాయి. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు చాడ వెంకట్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. పార్టీ నియమావళి ప్రకారం మూడు సార్లు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. దాంతో మూడోసారీ తనకే పదవి ఇవ్వాలని చాడ కోరగా అది జరగలేదు. చివరకు మాజీ ఎమ్మెల్యే కూనంపాటి సాంబశివరావు ఆ పదవి దక్కించుకున్నారు.

Also Read : ఆమెను తక్షణమే కోర్టులో హాజరుపర్చాలి.. మావోయిస్ట్ పార్టీ వార్నింగ్



Next Story

Most Viewed