ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మంత్రి పదవి.. సంబురాల్లో పాలమూరు జిల్లా

by Disha Web Desk |
ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మంత్రి పదవి.. సంబురాల్లో పాలమూరు జిల్లా
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు దక్కింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ చితురుడు అయిన జూపల్లి కృష్ణారావుకు ఐదేళ్ల విరామం అనంతరం మంత్రి పదవి దక్కింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన శేషగిరిరావు, రత్నమ్మ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానంలో ఆరవ సంతానం కృష్ణారావు. ఆయన 1955, ఆగస్టు 10వ తేదీన జన్మించారు. 1999వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో ఈ స్థానం పొత్తులో భాగంగా టీఆర్ఎస్‌కు కేటాయించడంతో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009, 2012 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలల్లోనూ జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో జూపల్లి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, పౌరసరఫల శాఖ, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, తన మంత్రి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో జూపల్లి గెలుపొందారు. 2014వ సంవత్సరంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేసీఆర్ ప్రభుత్వంలో భారీ పరిశ్రమలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా జూపల్లి ఓటమి పాలయ్యారు. తనపై గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి తీసుకోవడంతో ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అదే పార్టీలో కొనసాగుతూ తన కేడర్ దెబ్బతినకుండా ఉండేందుకు పార్టీ సహకరించకపోయినా తన అనుచరులను పోటీ చేయించి స్థానిక సంస్థలలో గెలిపించుకున్నారు. టికెట్టు తనకే వస్తుందనే ఆశతో ఉన్నాడు.

సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని సీఎం ప్రకటించడంతో జూపల్లి కృష్ణారావు పార్టీ మారేందుకు సన్నద్ధం కావడం, ఖమ్మం జిల్లా నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరపడంతో టీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లికి కొల్లాపూర్ నుండి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే ఆరవసారి ఓడిపోయిన జూపల్లి కృష్ణారావు ఏడవసారి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జూపల్లి కృష్ణారావుకు మళ్ళీ మంత్రి పదవి వరించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, జూపల్లి అనుచరులు ఉత్సాహంగా సంబురాలు జరుపుకుంటున్నారు.

Next Story