ఆ రంగాలకు రుణ సదుపాయం.. రూ. 5 లక్షల కోట్లకు పెంపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 13 |
Union Minister Kishan Reddy Asks CM KCR for Evidence Of Cloudburst
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి పర్యాటకం, ఆతిథ్య రంగాలపై పెను ప్రభావాన్ని చూపించిందని, ఈ నేపథ్యంలో ఈ రంగాలను ఆదుకునేందుకు అత్యవసర రుణ సదుపాయం హామీ పథకం కల్పించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణసదుపాయ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్)ను రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 4.5 నుంచి 5 లక్షల కోట్లకు పెంచడం జరిగిందన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాలు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. పర్యాటక రంగాన్ని ఆదుకోవడం ద్వారా దీనికి సంబంధించిన ఉద్యోగాలను కాపాడటం తో పాటు వ్యాపారస్తులకు మేలు జరగాలన్న లక్ష్యంతో మోడీ ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు తీసుకుంటుందన్నారు. పర్యాటక రంగంలో సుస్థిర పురోగతి, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్తులో పర్యాటక రంగం ఉండాల్సిన అంశాలపై ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పర్యాటక, ఆతిథ్య రంగాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని, ఈ రంగాలను పునరుద్ధరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు పరిశ్రమ, ఇందులోని భాగస్వామ్య పక్షాలతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందన్నారు. 31 మార్చి 2023 వరకు ఈసీఎల్‌జీఎస్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యారేజ్ హాళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్, చారిత్రక కట్టడాల నిర్వహణ తదితర ఆతిథ్య రంగంలోని వ్యాపారస్తులు, ఎంఎస్ఎంఈ లకు రుణ సదుపాయం పథకం కింద అర్హులు అవుతారని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed