- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ రైడ్స్ లో విస్తుపోయే విషయాలు
ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటను అవినీతి నిరోధక శాఖ (ACB) మరింత ఉధృతం చేసింది. తాజాగా రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మోహన్ నాయక్ పై పంజా విసిరింది. హైదరాబాద్ మాదాపూర్ లోని ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులకు మోహన్ నాయక్ అక్రమార్జన చిట్టా చూసి అవాక్కయినట్లు తెలుస్తోంది.
3 కిలోల బంగారం:
ఈ తనిఖీలపై ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మోహన్ నాయక్ నివాసంలో జరిపిన సోదాల్లో ఇప్పటివరకు భారీ ఎత్తున నగదు, బంగారం, మరియు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. లెక్కల్లో చూపని రూ.60 లక్షల నగదుతో పాటు కిలో బంగారు ఆభరణాలు, 15 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు హైదరాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే, ఇంట్లో లభించిన మొత్తం బంగారం బరువు సుమారు 3 కిలోల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని..
మోహన్ నాయక్ తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఆర్ అండ్ బీ శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర నుండి కమీషన్ల రూపంలో భారీగా వెనకేసినట్లు చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మోహన్ నాయక్ ఆర్థిక లావాదేవీలపై చాలా రోజులుగా రహస్యంగా నిఘా పెట్టామని పక్కా సమాచారంతో తాజాగా సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్ నాయక్ నివాసంలో సోదాలు ఇంకా ముగియలేదు. తనిఖీలు పూర్తిగా ముగిసే సమయానికి ఈ అవినీతి తిమింగలం ఆస్తుల విలువ ఏ రేంజ్ కు చేరుకుంటుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.






