మోడీ పిలుపు మేరకు నియోజకవర్గాల్లో క్రీడోత్సవాలు: మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 7 |
మోడీ పిలుపు మేరకు నియోజకవర్గాల్లో క్రీడోత్సవాలు: మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 'ఖేలో తెలంగాణ, జీతో తెలంగాణ' క్రీడోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో యువతలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని వెలికితీసి పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు.

ఈ నెల 21 నుంచి 23 వరకు క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని యువతతో పాటు పాత్రికేయులు, పార్టీకి సంబంధించిన కమిటీలకు పోటీలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఫిబ్రవరి పదో తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు గడువు ఉంది. ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. పార్టీలకు అతీతంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారన్న కిషన్ రెడ్డి.. అలాంటి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.

దేశ జనాభాలో యువత ఎక్కువగా ఉందన్న కిషన్ రెడ్డి.. జనాభా పరంగా క్రీడల్లో చాలా వెనుకపడ్డామన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి.. ప్రోత్సహిస్తోందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 90148 60496, 91991 99696 సంప్రదించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చింతల రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా , మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ ప్రేమ్ రాజ్, తెలంగాణ జూనియర్ కాలేజెస్ ఫిజికల్ డైరక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

యువత సద్వినియోగం చేసుకోవాలి: జగదీష్ యాదవ్

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగదీష్ యాదవ్ మాట్లాడుతూ.. మొత్తం క్రికెట్, కోకో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. మొదట సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీలు నిర్వహించి.. దానిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారిని.. పార్లమెంట్ స్థాయిలో పోటీలకు సెలెక్ట్ చేస్తామన్నారు. ఇలా 7 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 21 టీమ్‌లు పార్లమెంట్ స్థాయిలో పోటీపడతాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సికింద్రాబాద్ క్రీడోత్సవాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



Next Story