పండుగరోజు విషాదం...

by Disha Web Desk 18 |
పండుగరోజు విషాదం...
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. తేనేటీగల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మండల పరిధిలోని పాత సారపాకలో నివాసముండే చలికాని రాఘవులు, వెంకటరమణల ఏకైక కుమారుడు చలికాని సతీష్ (28) కందిరీగల దాడిలో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం సతీష్ నివసిస్తున్న ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఒక వేప చెట్టు కొమ్మను విరుస్తున్న క్రమంలో ఆ చెట్టుపై ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా సతీష్ ను చుట్టుముట్టి కుట్టడంతో ఒళ్లంతా వాచింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆ యువకుడిని భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య నిమిత్తం తరలించారు. వైద్యులు సతీష్ కు కొంతమేరకు వైద్యాన్ని అందించి మెరుగైన వైద్యం కొరకు ఖమ్మం తీసుకుని వెళ్లాల్సిందిగా సతీష్ కుటుంబసభ్యులకు తెలిపారు.

దీంతో మంగళవారం కుటుంబ సభ్యులు సతీష్ ను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి యువకుడు మృతిచెందాడు. మృతుడు సతీష్ సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. సతీష్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు బంధువులు,స్నేహితులు కంటతడి పెట్టుకున్నారు.

Next Story