ఆ కుటుంబానికి దిక్కెవరు ?

by Disha Web Desk 15 |
ఆ కుటుంబానికి దిక్కెవరు ?
X

దిశ, వైరా : వివాహం జరిగిన తర్వాత సుమారు 12 ఏళ్లకు జన్మించాడు ఆ కుమారుడు... ఒక్క గాని ఒక్క కుమారుడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు... తల్లిదండ్రులు కష్టపడి తమ కుమారుడిని ఎంబీఏ చదివించారు. గత 15 ఏళ్లగా ఆ కుమారుడు ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో పాటు తన తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. అయితే రోడ్డు ప్రమాద రూపంలో కుమారుడి కుటుంబాన్ని మృత్యువు కబళించటంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణాతీతంగా మారింది. విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి బాబురావు, సరోజని దంపతులకు వివాహం జరిగిన 12 ఏళ్ల తర్వాత కుమారుడు రాజేష్ జన్మించాడు. రాజేష్ ను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి ఎంబీఏ వరకు కష్టపడి చదివించారు. 2008వ సంవత్సరంలో హైదరాబాద్​లోని లారెస్ ఫార్మా కంపెనీలో ట్రైనీ ఉద్యోగిగా చేరిన పారుపల్లి రాజేష్ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఎకౌంటు మేనేజర్ గా పని చేస్తున్నాడు.

నెలకు 90 వేల రూపాయలు జీతం పొందుతున్న రాజేష్ ఆ నగదు తోనే తన కుటుంబంతో పాటు తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. అయితే కొణిజర్లలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్, సుజాత దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు ఆశ్రిత్ శ్రీరామ్ దుర్మరణం చెందారు. వారి పెద్ద కుమారుడు దివిజిత్ శ్రీరామ్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. తమకు ఉన్న ఒక్కగాని ఒక కుమారుడితో పాటు అతని భార్య, చిన్న మనవడు మృతి చెందడంతో రాజేష్ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ హృదయ విదారక సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కొడుకు, కోడలు,మనవడు మృతి చెందడంతో మాకు దిక్కు ఎవరంటూ రాజేష్ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది.

అవార్డు అందుకున్న ఆనందం వారం రోజుల్లోనే ఆవిరైంది....

ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసిన రాజేష్ హైదరాబాద్ లోని లారెస్ ఫార్మా కంపెనీలో 2008వ సంవత్సరంలో ట్రైనీ ఉద్యోగిగా చేరాడు. అప్పటి నుంచి 15 సంవత్సరాలు పాటు ఒకే కంపెనీలో పని చేస్తూ అంచెలంచెలుగా అదే కంపెనీలో అకౌంట్ మేనేజర్ గా ఎదిగాడు. ఒకే కంపెనీలో 15 ఏళ్లు పనిచేయడంతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రాజేష్ కు గత మే 26వ తేదీన ఆ కంపెనీ సీఈవో చావా సత్యనారాయణ ప్రసంశ పత్రంతో పాటు రూ.3.75 లక్షల నగదు రివార్డును అందజేశారు.

అయితే అవార్డు పొందిన ఆనందం వారం రోజులు గడవకముందే రాజేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది. వాస్తవానికి రాజేష్ ఈ నెల 2,3 తేదీల్లో తన ఉద్యోగానికి సెలవు పెట్టాడు. అయితే బుధవారం రాత్రి 7 గంటలకు ఆఫీస్ కి వెళ్ళిన రాజేష్ ఇంటికి వెళ్లేందుకు తనకు ఒకటో తేదీ నుంచి సెలవు కావాలని డిప్యూటీ జనరల్ మేనేజర్ కొమ్మినేని సతీష్ ను కోరగా ఆయన ఒకటో తేదీ నుంచే సెలవు మంజూరు చేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి రాజేష్ తన కుటుంబ సభ్యులతో విప్పలమడక బయలుదేరాడు. రాజేష్ అప్పటికప్పుడు ఒకటో తేదీ సెలవు పెట్టకుండా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.


Next Story