పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

by Disha Web Desk 15 |
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నవభారత్లో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిశ్రమలు స్థాపించాలంటే ఒక్కో కార్యాలయం చుట్టూ, అలాగే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన పరిస్థితి నుండి నేడు 15 రోజుల్లో సులభంగా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు ప్రక్రియ సులభతరంగా చేయడంతో పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు.

పెట్టుబడులు రావాలంటే ఆషామాషి కాదని, అందుకు తగిన సెక్యూరిటీ ఉండాలని, నేడు మన రాష్ట్రంలో అలాంటి సెక్యూరిటీ ఉంది కాబట్టే పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొస్తున్నారని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు శాంతిభద్రతలు, సౌకర్యాలు, రాయితీలతో పాటు నీరు, బొగ్గు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు నేడు రాష్ట్రంలో కల్పిస్తున్నామని చెప్పారు. అవకాశాలకు స్వర్గధామం మన జిల్లా అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పారిశ్రామికీకరణ వల్ల ప్రపంచ దేశాలు, సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు.

మన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్ అందించాలన్న విజన్ ముఖ్యమంత్రి కాబట్టే నేడు పోటీపడి అభివృద్ధిని సాధించేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత, మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధిని సాధించాలని చెప్పారు. మన జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని వనరులున్నాయని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిందే తడవుగా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామని, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

టీఎస్ ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 22,956 కోట్లతో 429 యూనిట్లు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామని, తద్వారా 11,099 మందికి ఉపాధికల్పించినట్లు చెప్పారు. టీ ఐడియా పథకం కింద రాష్ట్ర ఏర్పాటు నుండి మార్చి మాసాంతం వరకు 274 యూనిట్లుకు 26.29 కోట్లు రాయితీలు మంజూరు చేశామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎస్సీలు ఏర్పాటు చేసిన 368 యూనిట్లుకు 24.06 కోట్లు, ఎస్టీలు ఏర్పాటు చేసిన 1010 యూనిట్లుకు 47.37 కోట్లు, విభిన్న ప్రతిభావంతులు ఏర్పాటు చేసిన ఒక యూనిటుకు 4 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.


Next Story

Most Viewed