ఫ్లూ దడ.. బ్రాయిలర్ కోళ్లలో వైరస్..

by Sumithra |
ఫ్లూ దడ.. బ్రాయిలర్ కోళ్లలో వైరస్..
X

తమకు ఇష్టమైన చికెన్ తినాలంటే ప్రస్తుతం జనాలు బెంబేలెత్తుతున్నారు. కోళ్లకు వైరస్ సోకి చనిపోతున్నాయన్న విషయం తెలియడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోళ్లు చనిపోయాయన్న ప్రచారం జోరందుకోవడంతో చికెన్ కొనాలన్నా, హోటళ్లకు వెళ్లి తినాలన్నా ఆలోచనలో పడుతున్నారు. మూడు రోజులుగా ఈ ప్రచారం మరింత ఉధృతం కావడం, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా లాంటి ఆంక్షలు పౌల్ట్రీ ప్రాంతాల్లో పెడుతుండటంతో జిల్లాలోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అటు వ్యాపారులు, ఇటు కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

దిశ, ఖమ్మం బ్యూరో: వైరస్ సోకి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో చికెన్ ప్రియులు చికెన్ తినాలన్నా భయపడుతున్నారు. కొద్దిరోజులుగా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు చనిపోవడం, దాని ప్రభావం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పడుతుండటంతో క్రమంగా విక్రయాలు తగ్గు ముఖం పడుతున్నారు. పౌల్ట్రీ యజమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్లుండి వందలు, వేల సంఖ్యలో మృత్యువాత పడటం, కారణాలు తెలుసుకునేందుకు పశు సంవర్థకశాఖ అధికారులు శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపడం.. జనాలు చికెన్ తినేందుకు జంకుతుండటం వెరసి అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు.. పౌల్ట్రీ యజమానులు, చికెన్ విక్రేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బర్డ్ ఫ్లూ కారణంగా..

ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ రావడంతో అక్కడి అధికారులు ఆంక్షలు విధించారు. పౌల్ట్రీ ఫాంలో వైరస్ సోకిన కోళ్లను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలకు అక్కడి అధికారులు రంగంలోకి దింపారు. వైరస్ సోకిన పౌల్ట్రీ ఫాం వైపునకు వాహనాలను కూడా అనుమతించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. రెడ్‌జోన్ బోర్డులతో పాటు.. పోలీసుల ఆంక్షలు పెట్టారు. కరోనా తరహా ఆంక్షలు పెట్టడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృత్యువాత పడ్డ కోళ్ల శాంపిల్స్ ల్యాబ్‌లకు పంపితే బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయి విస్తరించకుండా కట్టడి చర్యలకు పూనుకున్నారు. ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫాంలో మిగతా కోళ్లను కూడా నిర్మూలించేందుకు అధికారులు సిద్ధమయ్యారన్న వార్తలు సరిహద్దున ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా యజమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫ్లూ వ్యాప్తి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నా జిల్లావాసుల్లో చర్చ మాత్రం సాగుతుంది.

జాగ్రత్తగా ఉండాలంటున్న ఉన్నతాధికారులు..

బర్డ్ ఫ్లూ, కొక్కెర ప్రబలుతున్న నేపథ్యంలో పౌల్ట్రీ యజమానులు, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ డిపార్ట్ మెంట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఓ జీఓ విడుదలైంది. పౌల్టీ యజమానులు, ప్రజలకు అవగాహన, వ్యాధి నిరోధక చర్యలపై అవగాహన కల్పించాలని అందులో సూచించారు. వ్యాధికి గురైన కోళ్లను, చనిపోయిన వాటిని తరలించే ప్రక్రియ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాటిని అనుమతించవద్దని సూచించారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల తరలింపును అడ్డుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖలతో సమావేశం ఏర్పాటు చేసుకుని కోళ్లకు వచ్చే వ్యాధులను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు.

వ్యాధి నివారణకు చర్యలు..

ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో బ్రాయిలర్ కోళ్లు అనూహ్యంగా మృత్యువాత పడుతుండటంతో అటు ఉన్నతాధికారులతో పాటు.. జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వైరస్, ఫ్లూ కారణంగా కోళ్లు మరణిస్తున్నాయన్న విషయం తీవ్ర చర్చ కావడంతో ఎక్కడికక్కడ నివారణ చర్యలకు పూనుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కోళ్లను అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు. చనిపోయిన, వ్యాధిసోకిన కోళ్లను అత్యంత జాగ్రత్తగా, వ్యాధి వ్యాప్తి చెందకుండా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నారు. పౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. అధికారులకు సహకరిస్తున్నారు. ప్రజలు సైతం చికెన్ తినేందుకు జంకుతున్నారు.

జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు.. వెంకట్ నారాయణ, పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జేడీ

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా.. బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు. ఇప్పటికే ఖమ్మం, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి వేంసూరు మండలాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నాలుగు మండలాల తహసీల్దార్లతో కలిసి పౌల్ట్రీలు ఉన్న ప్రదేశాలను తనిఖీ చేసి, ఆంధ్ర నుంచి ఏమైనా కోడి పిల్లలను తీసుకువచ్చారా లేదా అనే దానిపై సమీక్షిస్తాం. తిరువూరు, అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌లను ప్రతిరోజు తనిఖీ చేస్తున్నాం. ఏలూరు నుంచి ఏమైనా కోళ్లు వస్తే వాటికి సంబంధించి నివారణ చర్యలు పౌల్ట్రీల యజమానులకు అర్థమయ్యేలా చెబుతాం. ప్రస్తుతం ఆంధ్రా నుంచి ఎలాంటి కోళ్ల లోడ్లు రాకుండా చేశాం. గత 15 రోజులుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

Next Story