- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైరా మున్సిపాలిటీలో ఫైరవీల జోరు

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో దొడ్డిదారిన ఇంజనీరింగ్ విభాగంలో ఔట్సోర్సింగ్ కింద ఓ యువకుడిని ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఓ కీలక అధికారి రంగం సిద్ధం చేశారు. అయితే అధికారి నిర్ణయాన్ని మున్సిపాలిటీలోని అత్యధిక మంది కౌన్సిలర్లు వ్యతిరేకించారు. దీంతో ఆ అధికారి ప్రయత్నం విఫలమైంది. కానీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నా ఇంజనీరింగ్ విభాగంలో ఔట్సోర్సింగ్ కింద ఆ యువకుడిని వర్క్ ఇన్స్పెక్టర్గా తీసుకునేందుకు సదరు అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద గతంలో వైరా మున్సిపాలిటీకి రూ.20 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం పూర్తయింది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కింద కొనిజర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ప్రైవేట్ ఇంజనీర్ గా పనిచేశాడు. అప్పట్లో మున్సిపాలిటీలో ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన అధికారికి, ఆ యువకుడికి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆ పనులు అయిపోవడంతో సదరు యువకుడు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నాడని సమాచారం. దీంతో మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ భాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగంలోకి తీసుకునేందుకు గత వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికే పలువురు కౌన్సిలర్ల అభిప్రాయాలను సదరు అధికారి తీసుకున్నారని తెలిసింది. అయితే అత్యధిక మంది కౌన్సిలర్లు ఆ యువకుడిని ఉద్యోగంలోకి తీసుకునేందుకు సుముఖంగా లేరని సమాచారం. కొంతమంది కౌన్సిలర్లు ఆ అధికారి ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.
గతంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం
వైరా మున్సిపాలిటీలో కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించటంతో ఇటీవల కాలంలో వారిని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి విధుల నుంచి తొలగించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నూతనంగా మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగిని తీసుకోవాలని అధికారి నిర్ణయం తీసుకోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఒకవేళ తప్పనిసరిగా ఇంజనీరింగ్ విభాగానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగి అవసరమైతే ప్రభుత్వ నిబంధన ప్రకారం తీసుకుంటే అభ్యంతరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా ఆ అధికారి దొడ్డి దారిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిని తీసుకునే ప్రయత్నాలు నిలిపి వేస్తారో... లేదో వేచి చూడాలి.