ఇష్టారాజ్యాంగా పశువైద్యాధికారులు.. అటెండర్లే వైద్యులుగా విధులు

by samatah |
ఇష్టారాజ్యాంగా పశువైద్యాధికారులు.. అటెండర్లే వైద్యులుగా విధులు
X

దిశ కూసుమంచి: మండలంలోని పశు వైద్యాధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కూసుమంచి మండల కేంద్రంతో పాటు పాలేరు, జిళ్ల చెరువు, గట్టుసింగారం, జక్కెపల్లి, ఈశ్వరమాదారం, గ్రామాలలో పశు వైద్యశాలల్లో నిత్యం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటలకు విధులు నిర్వహించాల్సి ఉండగా ఇష్టం వచ్చినప్పుడు రావడం, పోవడం చేస్తున్నారు. ఓ సమయం అంటూ లేకుండా మధ్యాహ్నం వరకే విధులను ముగించుకొని సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. జిల్లా పశు వైద్యాధికారుల తనిఖీలు చేయకపోవడంతోనే వీరు ఇలా ప్రవర్తిస్తున్నారని తెలుస్తున్నది.

మండలంలోని జక్కెపల్లి జూనియర్ వెటర్నరీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వరలక్ష్మి శుక్రవారం పై అధికారులకు ఎటువంటి సమాచారం విధులకు గైర్హాజరైంది. ఈ విషయమై పశు వైద్యాధికారి నీలాకాంత్‌ను ఫోన్‌లో సంప్రదించగా తాను విధులకు హాజరయ్యాయనని, గ్రామంలో ఒకచోట ఉన్నానని, నెలకొండల్లి ఎస్టీఓకు వెళ్లానంటూ నోటికి వచ్చినట్లు చెప్పింది. ఈమె జక్కెపల్లి, ఈశ్వరమాదారం రెండు సెంటర్లకు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఇలా చెప్పా పెట్టకుండా గైర్హాజరు కావడంతో ఇక్కడికి పశువులను తోలుకు వచ్చే రైతులు నానా అవస్తలు పడుతున్నారు. ఇక గట్టుసింగారం సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌చార్జి పశువైద్యాధికారి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. పశువైద్యశాలకు చెందిన డోర్ తాళాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి మైంటైన్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రైతుల అవస్థలు

ఉదయం పశువైద్యాధికారులు ఆస్పత్రికి ఆలస్యం వస్తుండటంతో ఇక్కడికి పశువులను తోలుకు వచ్చిన రైతులు గంటల కొద్ది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మధ్యాహ్నం వచ్చినా అందుబాటులో ఉండటం లేదు. వ్యవసాయ పనులు మొదలు కానున్న తరుణంలో పశువైద్యుల తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని పశువైద్యశాలల పరిస్థితి ఇలాగే ఉందని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు.

నోటీసులిస్తాం

నీలాకాంత్, మండల పశు వైద్యాధికారి

ఎటువంటి పర్మిషన్ లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారికి నోటీసులు ఇస్తాం. గట్టుసింగారం గ్రామంలోని వైద్యశాలను ప్రైవేట్ వ్యక్తులు తాళాలు వేయడం, తీయడం జరుగుతుందని ప్రశ్నించగా అటువంటిది ఏంలేదని తెలిపారు.



Next Story

Most Viewed