ఖమ్మం 'కారు'లో కల్లోలం.. 'తాటి' బాటలో మరికొంతమంది కీలక నేతలు!

by Disha Web |
ఖమ్మం కారులో కల్లోలం.. తాటి బాటలో మరికొంతమంది కీలక నేతలు!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కారు పార్టీలో కల్లోలం మొదలైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు వర్గపోరుతో రగులుతున్నాయి. తాజా మాజీలతో కారు కిక్కిరిసిపోవడంతో బ్యాలెన్స్ తప్పుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ భవితవ్యం ఏంటో అనుకున్న నేతలు ఇప్పటినుంచే దారులు వెతుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల యువనేత ఖమ్మం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో కొంతమంది నేతలు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకుంటే ఎలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి నియోజకవర్గాల్లో విపరీతమైన వర్గవిభేదాలతో ఇదే పార్టీ మారడానికి అదునుగా భావిస్తూ కొందరు ముఖ్యనేతలు, ద్వితీయశ్రేణి నాయకులు కూడా కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇటీవల తీవ్రవ్యాఖ్యలు చేస్తూ కారుదిగి హస్తం గూటికి చేరడంతో పార్టీలో జంపింగ్‌లు స్టార్ట్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. కరకగూడెం జెడ్పీటీసీ సైతం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీన్ని బట్టి చూస్తే వచ్చేది ఎలక్షన్స్ సీజన్ కాబట్టి ఇప్పటి నుంచే నేతలు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.

కలకలం రేపిన తాటి రాజీనామా

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాటి హస్తం గూటికి వెళ్లే ముందు పార్టీ పెద్దలు, స్థానిక నేతలపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి పార్టీపై నేతల అసంతృప్తి ఒక్కసారిగా బయటపడ్డట్లైంది. తాటి రాజీనామా చేసిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోటీ తట్టుకోలేకే రాజీనామా చేస్తారనడం, జలగం వెంకటరావు ఏ పార్టీనుంచి పోటీచేస్తారో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేయడంతో మరికొంతమంది నేతలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పొంగులేటి అనుచరుడి గుర్తింపు ఉన్న తాటి వెంకటేశ్వర్లు 2014లో వైసీపీ తరఫున గెలిచారు. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తనకు టికెట్ రావడం కష్టమని భావించి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇ

అదేబాటలో..?

పార్టీపై అసంతృప్తితో మరికొంతమంది అగ్రనేతలు, ముఖ్యనాయకులు, ద్వితీయశ్రేణి నేతలు సైతం ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా అసంతృప్తిగా ఉన్న ముఖ్యనేతలకు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్న తీవ్ర వర్గపోరు.. అధిష్టానం సైతం వారిని కట్టడి చేయకపోవంతో అసంతృప్తిగా ఉన్న నేతలు వేరే పార్టీలవైపు పక్కచూపులు చూస్తున్నారు. కరకగూడెం జెడ్పీటీసీ సైతం రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశిస్తున్న కొంతమంది మాజీలు సైతం టికెట్ రాదని భావించి హస్తంతో దోస్తీకి సయ్యంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తాటి వెంకటేశ్వరు బాటలో మరో ఇద్దరు మాజీలు నడవనున్నట్లు సమాచారం. ఓ గిరిజన ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రహస్యంగా రెండుమూడు సార్లు మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీనుంచి సమీప భవిష్యత్ లో వలసలు పెరగనున్నాయనే టాక్ వినిపిస్తోంది.

టికెట్ దక్కకుంటే జంపే..

వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో అన్ని నియోజకవర్గా్ల్లో వర్గపోరు నడుస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించేవారు ఇద్దరికంటే ఎక్కువగానే ఉన్నారు. వీరిలో పార్టీ తరఫున టికెట్ వచ్చేది ఒక్కరికే కాబట్టి.. మిగతావారు కచ్చితంగా వేరేపార్టీలోకి వెళ్లే పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే అలాంటి వారి జాబితా ప్రత్యర్థి పార్టీలు సేకరించే టికెట్ మేమిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక జరిగితే అన్ని నియోజకవర్గాల్లో వలసలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ అధిష్టానం నయానో భయానో బజ్జగించి ఆపేందుకు ప్రయత్నించినా.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు ఈసారి ఆగే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ బలవతంగా పార్టీలో ఉండాల్సి వస్తే.. మాత్రం పార్టీలోనే ఉండి పుట్టిముంచే ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed