రూ.కోట్ల విలువైన మట్టిని కొల్లగొడుతున్నారు

by Disha Web Desk 15 |
రూ.కోట్ల విలువైన మట్టిని కొల్లగొడుతున్నారు
X

దిశ, వైరా : మైనింగ్ దందాను తలదన్నేలా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామ రెవెన్యూలో కోట్లాది రూపాయల మట్టిని కొల్లగొడుతున్నారు. ప్రకృతి సంపద అయిన ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్టను అక్రమార్కులు తోడేస్తున్నారు. నెల రోజులుగా సుమారు 50 డంపర్లతో ఐదు ప్రొక్​లైన్లతో మట్టిని తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారెవెన్యూ, మైనింగ్ అధికారులు కల్లుండి కబోదుల్లా వ్యవహరిస్తున్నారు.

డంపర్ల లో అక్రమంగా మట్టి రవాణాతో తనికెళ్ల గ్రామవాసులు ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలూ ఈ దందా కొనసాగుతుంది. రాత్రి వేళల్లో డంపర్ల శబ్దాలతో తనికెళ్లవాసుల కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ అధికారులు తమకేమీ తెలియదని పేర్కొనడం విధులు పట్ల వారికి ఉన్న నిర్లక్ష్య, బాధ్యతరాహిత్యాన్ని బహిర్గతం చేస్తోంది. మట్టి దందా చేసే అక్రమార్కులకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

40 ఎకరాల ప్రభుత్వ గుట్ట మట్టిని మింగేస్తున్నారు.....

కొనిజర్ల మండలం తుమ్మలపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 186 లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ గుట్ట ఉంది. అయితే ఈ గుట్టపై రెవెన్యూ అధికారుల అండదండలతో గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ కన్ను పడింది. కొణిజర్ల, వైరా మండలాల్లో ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు జరుగుతున్నాయి. నూతన రోడ్డు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం క్యూబిక్ మీటర్ల ప్రకారం కాంట్రాక్టర్​కు నగదును చెల్లిస్తుంది. అయితే రెవెన్యూ, మైనింగ్ అధికారులతో మిలాకత్ అయిన కాంట్రాక్టర్ తుమ్మలపల్లి గ్రామంలోని 186వ సర్వే నెంబర్ లో ఉన్న సుమారు 40 ఎకరాల ప్రభుత్వ గుట్ట పైనున్న మట్టిని గ్రీన్ ఫీల్డ్ హైవేకు గత నెల రోజులుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు.

ఐదు ప్రొక్​లైన్లతో 50 పెద్ద డంపర్లతో ఈ అక్రమ మట్టి రవాణా కొనసాగుతోంది. అయితే ఈ రవాణాను గతంలో అడ్డగించిన కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మౌనంగా ఉండటం విశేషం. వాల్టా చట్టంకు విరుద్ధంగా గుట్ట మట్టిని నెల రోజులుగా అక్రమ రవాణా చేస్తున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం విశేషం. ఇప్పటికే సుమారు 5 ఎకరాల్లో గుట్ట మట్టిని అక్రమంగా తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలోని మట్టిని కాంట్రాక్టర్ అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

భయాందోళనలో తనికెళ్లవాసులు...

పగలు రాత్రి అనే తేడా లేకుండా తుమ్మలపల్లి నుంచి తనికెళ్ల వచ్చే రోడ్డులో మట్టి డంపర్లు వేగంగా వెళ్తున్నాయి. దీంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. సింగిల్ రోడ్డు గా ఉన్న ఈ రోడ్డుపై డంపర్లు 50 టన్నుల నుంచి 70 టన్నుల వరకు మట్టి లోడుతో తిరుగుతుండటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సామర్థ్యానికి మించి అత్యధిక ఓవర్ లోడుతో డంపర్లు తిరుగుతుండటంతో రోడ్డు అధ్వానంగా మారుతుంది. ప్రధానంగా రాత్రివేళల్లో డంపర్లు తిరుగుతుండటంతో పెద్ద పెద్ద శబ్దాల వల్ల గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. అంతేకాకుండా డంపర్లు నిరంతరం తిరుగుతుండటంతో దుమ్ము లేచి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు, గ్రామస్తులు ఈ రోడ్డుపైకి రావాలంటేనే హడలిపోతున్నారు.

నెల రోజులుగా జరుగుతున్నా రెవెన్యూ అధికారులకు తెలియదట....

తుమ్మలపల్లి రెవెన్యూ లోని 186 సర్వే నెంబర్లు ఉన్న ప్రభుత్వ గుట్టపై నుంచి మట్టి అక్రమ రవాణా నెల రోజుల నుంచి నిరంతరాయంగా జరుగుతున్న విషయం తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెప్పటం విశేషం. ఈ విషయమై దిశ కొణిజర్ల తహసీల్దార్ డి. సైదులు ను ఆదివారం వివరణ కోరింది. అయితే తుమ్మలపల్లి లోని 186 సర్వే నెంబర్లో ప్రభుత్వ గుట్ట నుంచి మట్టి తోలుకునేందుకు నేషనల్ హైవే కాంట్రాక్టర్ అనుముతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని సైదులు స్పష్టం చేశారు.

అయితే నేటి వరకు ప్రభుత్వం నుంచి మట్టి తోలుకునేందుకు అనుమతి రాలేదని చెప్పారు. నెల రోజులుగా మట్టి అక్రమ రవాణా విషయం తమ దృష్టికి రాలేదని ఆయన వివరించారు. తుమ్మలపల్లి, తనికెళ్ల రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ అక్రమ మట్టి రవాణా కొనసాగుతోంది. నెల రోజులుగా జరుగుతున్న ఈ భాగోతం గురించి తుమ్మలపల్లి వీఆర్ఏ, తనికెళ్ల వీఆర్ఏ, గిర్దావర్లు కూడా తహసీల్దార్ కు చెప్పలేదా...? అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. గ్రామాల్లో ఇళ్లకు మట్టి తోలుకుంటేనే అనుమతులు లేవని నిలుపుదల చేసే రెవెన్యూ అధికారులు కోట్లాది రూపాయల మట్టిని కొల్లగొట్టే విషయం తమకు తెలియదని చెప్పటం పలు అనుమానాలకు దారితీస్తుంది.

రెవెన్యూ అధికారుల అండదండలతో కొంతమంది ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈ మట్టి దందా కొనసాగుతుందని తనికెళ్ల గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దిశ తహసీల్దార్ సైదులును వివరణ కోరగానే అక్రమ మట్టి రవాణాను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేయటం విశేషం. అయితే ప్రభుత్వ గుట్టపై 220 మిషన్లు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అధికారుల అవినీతి అక్రమాల వల్ల ప్రకృతి సంపద ధ్వంసంకు గురవుతుంది. ఇంత దందా జరుగుతున్నా మైనింగ్ అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవటం విశేషం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గుట్ట మట్టి అక్రమ రవాణాను అరికట్టి, నెల రోజులుగా మట్టి దందా కొనసాగించిన వారిపై చర్యలు తీసుకోవాలని తనికెళ్ల, తుమ్మలపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed