12 గంటల్లోపే దొంగ దొరికాడు

by Sridhar Babu |
12 గంటల్లోపే దొంగ దొరికాడు
X

దిశ, వైరా : వైరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ ఓ గా పనిచేస్తున్న జి.ధనలక్ష్మి మెడలోని బంగారపు గొలుసును అపహరించిన దొంగను 12 గంటల వ్యవధిలోపే వైరా పోలీసులు పట్టుకున్నారు. వైరా పీహెచ్​సీలో సీహెచ్ ఓ గా పనిచేస్తున్న ధనలక్ష్మి స్థానిక పాత బస్టాండ్ పెట్రోల్ బంక్ సమీపంలోని బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం వైరా పీహెచ్సీలో తన విధులకు హాజరయ్యారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆమె భోజనం చేసేందుకు పీహెచ్​సీ నుంచి నడుచుకుంటూ తన నివాసం ఉండే బాలాజీ టవర్స్ కు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు ద్విచక్ర వాహనంపై ఆమె ఎదురుగా వచ్చి మెడలోని బంగారపు గొలుసును లాక్కొని పరారైన విషయం పాఠకులకు విధితమే. ఈ విషయాన్ని తెలుసుకున్న వైరా ఏసీపీ రెహమాన్,సీసీఎస్ ఏసీపీ రవికుమార్,

వైరా సీఐ నున్నావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలు ధనలక్ష్మిని చోరీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చోరీ జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలించి ఆ సీసీ కెమెరాలు ఆధారంగా చోరీకి పాల్పడిన దుండగుడి చిత్రాన్ని గుర్తించారు. వైరా ఏసీపీ రెహమాన్ ఆదేశాలతో వైరా సీఐ నున్నావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్, పోలీస్ సిబ్బందిని పలు బృందాలుగా విభజించి దొంగ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ చిత్రం ఆధారంగా ఖమ్మంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం

అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకొని వైరా పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. బాధితురాలు ధనలక్ష్మి ఆ నిందితుడిని చూసి తన బంగారు గొలుసును చోరీ చేసింది అతనేనని నిర్ధారించారు. నిందితుడి నుంచి బంగారపు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడిన యువకుడు శేఖర్ ముదిగొండ ప్రాంతానికి చెందిన వాడు కాగా ప్రస్తుతం ఖమ్మం చర్చి కాంపౌండ్ ప్రాంతంలో ఉంటూ క్యాటరింగ్ పనులకు వెళ్తున్నట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడ్డ అతను ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. వైరాలో చైన్ స్నాచింగ్ జరిగిన 12 గంటల వ్యవధిలోపే దొంగను పట్టుకున్న వైరా సీఐ నున్నవత్ సాగర్, ఎస్ఐ మేడాప్రసాద్ లతో పాటు స్థానిక పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.



Next Story

Most Viewed