విలేఖరిపై ఫారెస్ట్ సిబ్బంది దాడి.. మీడియా అంతు చూస్తామని వార్నింగ్

by Disha Web |
విలేఖరిపై ఫారెస్ట్ సిబ్బంది దాడి.. మీడియా అంతు చూస్తామని వార్నింగ్
X

దిశ, అశ్వారావుపేట: పోడు భూముల వివాదాన్ని చిత్రీకరిస్తున్న విలేకరిపై ఫారెస్ట్ సిబ్బంది అనూచితంగా ప్రవర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం సమీప పోడు భూమిలో విత్తనాలు జల్లేందుకు వెళ్ళిన గిరిజనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అటవీశాఖ సిబ్బంది పోడు సాగుదారులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధిపై సైతం ఫారెస్ట్ అధికారుల ప్రతాపం చూపారు. వివాదాన్ని చిత్రీకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి వినోద్ కెమెరా ఫోన్‌ను లాక్కుంటూ బలవంతంగా జీపులో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విలేకరి కింద పడిపోయినప్పటికీ కనికరించలేదు. సదరు విలేఖరి వీడియో తీయడం వల్లే పోడు రైతులు రెచ్చిపోతున్నారంటూ.. పరుష పదజాలంతో మీడియా అంతు చూస్తామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బెదిరింపులకు పాల్పడ్డారు.

పోడు రైతులపై చేస్తున్న దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తారన్న ఉద్దేశంతోనే తనపై ఫారెస్ట్ సిబ్బంది ఎదురు దాడికి ఒడిగట్టారని బాధిత విలేకరి వాపోయాడు. విలేకరిపై దురుసుగా ప్రవర్తించిన ఘటనపై అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ అధికారిని సహచర విలేకరులు వివరణ అడుగుతున్న సమయంలో సైతం దురుసుగా వ్యవహరించిన ఫారెస్ట్ సిబ్బంది మీడియా ప్రతినిధులను హేళన చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించిన సదరు ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో బాధితు విలేఖరి ఫిర్యాదు చేశాడు. కవరేజ్‌కి వెళ్ళిన విలేకరిపై దాడికి పాల్పడడమే కాకుండా.. మీడియాను కించపరిచే విధంగా ప్రవర్తించిన ఫారెస్ట్ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేటకు చెందిన విలేకరులు, సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

దాడి చేసినవారిని సస్పెండ్ చేయాలి

మీడియాపై దాడులు నశించాలని.. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో విశాఖపట్నం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి విలేకరుల సంక్షేమ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. కవరేజ్‌కి వెళ్ళిన విలేకరిపై దాడికి పాల్పడడమే కాకుండా.. మీడియాను కించపరిచే విధంగా ప్రవర్తించిన ఫారెస్ట్ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు విలేకరులు డిమాండ్ చేస్తున్నారు.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed