స్పాట్‌బిల్లర్స్ చేతివాటం !

by Sumithra |
స్పాట్‌బిల్లర్స్ చేతివాటం !
X

దిశ, ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ జ్యోతి పథకం ఎన్పీడీసీఎల్‌లో కొంత మంది సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన వర్గాల కోసం 200లోపు యూనిట్లు వినియోగిస్తే పూర్తిగా ఉచితంగా గృహ జ్యోతి పథకం కింద అమలు చేస్తోంది. ఈ పథకం 2024 మార్చి1న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఖమ్మం జిల్లా ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలోని 200 యూనిట్ల పథకం 2.62లక్షల మంది వినియోగించుకుంటున్నారు. అయితే ఈ పథకం సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల స్పాట్ బిల్లర్ సిబ్బంది రీడింగ్ తీసే సమయంలో వారి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 200 యూనిట్లు నుంచి 300 యూనిట్లు వచ్చిన వినియోగదారుల నుంచి రూ.200 నుంచి 300 వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

వసూళ్ల పర్వం

ఎన్పీడీసీఎల్ సర్కిల్‌లోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి, ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని 200 యూనిట్లు దాటితే స్పాట్ బిల్లర్స్ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 200 యూనిట్లు నుంచి 2020 యూనిట్లు ఉంటే దానిని మేము సరి చేస్తాము రూ.300 ఇవ్వండి అని బహిరంగంగానే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. మీటర్ రీడింగ్ సరి చేసే సమయంలో కంప్యూటర్ సెక్షన్లో సిబ్బందిని అడిగి మరీ 200 యూనిట్లు కుదిస్తున్నారు. ఈ తతంగం ఖమ్మం నగరంలో ఎక్కువగా అవుతుందని ఎన్పీడీసీఎల్ సిబ్బంది బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి 200 యూనిట్లు కుదింపు జరుగుతుందని సిబ్బంది చెప్తున్నారు. వేసవి కాలం సమయంలో ఎక్కువ విద్యుత్తు వినియోగం ఉండే అవకాశం నేపథ్యంలో యూనిట్లు ఎక్కువగా నమోదు కావడంతో స్పాట్ బిల్లర్స్ చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది.

చోద్యం చూస్తున్న అధికారులు

గృహజ్యోతి పథకం కింద స్పాట్ బిల్లర్స్ వసూళ్ల పై ఏఈ, ఏఈడీ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిపోవడంతో ఇలాంటి తతంగం నడుస్తుందని సిబ్బంది చెబుతున్నారు. గృహ జ్యోతి పథకం కింద వినియోదారుల విద్యుత్ వినియోగం బిల్లుల హెచ్చు తగ్గుల పై ఇప్పటి వరకు సిబ్బందితో ఎలాంటి సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. వేసవికాలం ఉండడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున గృహ జ్యోతి పై అధికారులు చర్చించి, స్పాట్ బిల్లర్స వసూళ్ల పై అడ్డుకట్ట వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

గృహ జ్యోతి కనెక్షన్పై తనిఖీలు చేస్తాం.. నాగార్జున, ఎన్పీడీసీఎల్ ఖమ్మం నగర 1 ఏడీఈ

గృహజ్యోతి పథకంలో మంజూరైన కనెక్షన్ల పై తనిఖీలు చేస్తున్నాం. యూనిట్లు కుదిస్తామని డబ్బులు తీసుకుంటే స్పాట్ బిల్లర్స్ పై చర్యలు తీసుకుంటాం.

Next Story