ఆరంభ శూరత్వమే..

by Disha Web Desk 1 |
ఆరంభ శూరత్వమే..
X

ఒక్క రోజుకే నిలిచిన వైరా-మధిర రోడ్డు మరమ్మతు పనులు

దిశ, వైరా:వైరా-మధిర ప్రధాన రహదారి పనులు ఆరంభ శూరత్వం గానే మిగిలాయి.రోడ్డును అభివృద్ధి పనుల నిమిత్తం ఆర్ అండ్ బీ నుంచి ఆరు నెలల క్రితం రూ.4కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే, మట్టి సమస్యతో పనులు ప్రారంభం కాలేదు. జనవరి 25న వైరా-మధిర ప్రధాన రహదారి దుస్థితిపై "నిధులు ఉన్నా.. పనులు చేయట్లే " అనే వార్త కథనం దిశలో ప్రచురితమైంది. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ వీపీ గౌతమ్ రహదారి మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో గొల్లపూడి సమీపంలో బుధవారం పనులను ప్రారంభించారు. అయితే, గురువారం మట్టి లేమితో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

మట్టి తరలించే డంపర్లను అడ్డుకున్న రైతులు

కలెక్టర్ అదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు మండలం పరిధిలోని కొండకుడిమలో ఉన్న కనిగిరిగుట్ట మట్టిని వైరా- మధిర రోడ్డు అభివృద్ధికి వాడుకోవాలి సూచించారు. ఆ మేరకు నెల రోజులు మట్టిని డంపర్లలో తరలించేందుకు కాంట్రాక్టర్ నుంచి మైనింగ్ శాఖకు రూ.89 వేలను చలానా రూపంలో చెల్లించాడు. ఈ నేపథ్యంలో బుధవారం గొల్లపూడి సమీపంలో రోడ్డు మరమ్మతు కోసం పొక్లయిన్ తో రోడ్డును పూర్తిగా తవ్వారు. రోడ్డును చదును చేసేందుకు కొండకూడిమలోని కనిగిరిగుట్ట నుంచి డంపర్లలో తరలిస్తుండగా స్థానికంగా ఉన్న కొంతమంది రైతుల వాహనాలకు అడ్డుకున్నారు. తమ గ్రామంలోని గుట్ట మట్టిని తవ్వనివ్వమని వారు స్పష్టం చేశారు. గతంలో గుట్టపై ఈజీఎస్ కింద మొక్కలు నాటారని ఆ మొక్కలు మట్టి తవ్వడంతో పూర్తిగ ధ్వంసం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గురువారం మట్టి తవ్వకం పూర్తిగా నిలిచింది. మరోవైపు మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ పూర్తిస్థాయి అనుమతులతో కొండకుడిమ గుట్ట మట్టి తరలిస్తున్నామని వైరా ఇంఛార్జ్ ఆర్అండ్ బీ ఏఈ ప్రవీణ్ కుమార్ దిశకు తెలిపారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా మట్టి సమస్యతో దాదాపు ఆరు నెలలుగా రోడ్డు మరమ్మత్తు పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Next Story

Most Viewed