బాత్ రూమే....ఆయనకు ఇంద్రభవనం

by Sridhar Babu |
బాత్ రూమే....ఆయనకు ఇంద్రభవనం
X

దిశ, దమ్మపేట : ఆయనకు పేదరికమే శాపం అయింది. ఒంటరితనం భారమైంది. దీంతో బతుకు బాత్రూం పాలయింది. అదే ఆయనకు ఇంద్రభవనం అయింది. నిరక్షరాస్యత ఓ వైపు, తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియని అమాయకత్వం మరోవైపు కలిసి దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన చిన్నఇల్లు, ఇప్పుడు కురుస్తున్న చిన్న చిన్న వర్షాలకే పైనుండి వర్షపునీరు కురుస్తుండటంతో ఆ ఇంట్లో నివసించలేక ఓ గిరిజన వృద్ధుడు బాత్రూం గదినే నివాస గృహంగా మార్చుకొని గృహలక్ష్మి పథకం కోసం ఎదురుచూస్తున్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువాయిగూడెం గ్రామంలో పద్ధం భద్రయ్య అనే వృద్ధుడు బాత్రూంనే తన నివాసంగా చేసుకొని బతుకును సాగదీస్తున్నాడు. బాత్రూం గదిలోనే చిన్న కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పక్కనే మంచంపై సేదతీరుతున్నాడు. సంతానం లేదు. ఉన్న ఒక్క వికలాంగురాలైన భార్య మరణించడంతో ఒంటరిగా బతుకుభారంగా కాలం వెళ్లదీస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన బెడ్ రూమ్ ఇల్లు కానీ, గృహలక్ష్మి పథకం కానీ ఆయనకు అందని ద్రాక్షగా మారింది.

గృహలక్ష్మి పథకంలో ఇంటికోసం అధికారుల వద్దకు వెళ్తే తనకి స్లాబుతో కూడిన ఇల్లు ఉందని అధికారులు సమాధానం ఇస్తున్నారన్నాడు. దీంతో తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ, గృహలక్ష్మి పథకం కానీ వర్తించవని అధికారులు చెప్పటంతో కురుస్తున్న ఇంటికి మరమ్మతులు చేపించే ఆర్థిక పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నాడు. రోజంతా కూలి నాలి చేసుకొని ఇంటికి వచ్చిన తనకి నీడనిచ్చే ఇల్లు లేక దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు నివాస గృహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యేను, అధికారులను ఆయన వేడుకుంటున్నాడు.



Next Story

Most Viewed