గుండె సంబంధిత సమస్యతో వస్తే జ్వరానికి పరీక్షలు

by Sridhar Babu |
గుండె సంబంధిత సమస్యతో వస్తే జ్వరానికి పరీక్షలు
X

దిశ, కొత్తగూడెం : గుండె సంబంధిత సమస్యతో వస్తే డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి రిపోర్టులు ఇచ్చిన సంఘటన కొత్తగూడెం ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రిలో వెలుగుచూసింది. గత నెల 28వ తేదీన పాల్వంచకు చెందిన జి. నరహరి అనే వ్యక్తి గుండెలో నొప్పిగా ఉంది అని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యుడిని సంప్రదించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడు టుడి ఎకో, సీబీపీ, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలని నరహరికి రాసి ఇచ్చారు. దీంతో నరహరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ కు వెళ్లి రక్త నమూనాలని ఇచ్చారు.

సోమవారం రిపోర్టులు వస్తాయని ల్యాబ్ సిబ్బంది తెలపడంతో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు. సోమవారం నరహరి తన మొబైల్ కి వచ్చిన రక్త పరీక్షల లింకు ఓపెన్ చేసి చూడడంతో సీబీపీ రిపోర్టుతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ నిర్ధారణ పరీక్షల రిపోర్టు కూడా వచ్చింది. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రిపోర్టు అసలు రానేలేదు. దీంతో అయోమయానికి గురైన నరహరి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఇదేమిటని ల్యాబ్ సిబ్బందిని నిడదీశాడు. ఇంత నిర్లక్ష్యం ఏంటని, వైద్యులు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చెయ్యమని రాసి ఇస్తే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పందించిన ల్యాబ్ సిబ్బంది పొరపాటున జరిగిందని లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం మరలా రక్త నమూనాలను తీసుకున్నారు. ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసేందుకు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని నరహరి తెలిపారు. రెండోసారి తీసుకున్న రక్త నమూనాలతో లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల రిపోర్టుని ల్యాబ్ సిబ్బంది తయారు చేసి ఆన్లైన్లో ఉంచారు. ఈ అంశంపై ఆసుపత్రి సూపరింటెండెంట్​ రాధమోహన్ ని వివరణ కోరగా రిపోర్టుల్లో తేడా వచ్చినట్టు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, ల్యాబ్ సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed