పొంగులేటి తరఫునే "తెల్లం" పోటీ?

by samatah |
పొంగులేటి తరఫునే తెల్లం పోటీ?
X

దిశ, భద్రాచలం : బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు వచ్చే ఎన్నికల్లో పొంగులేటి టీమ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. తెల్లం అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించనప్పటికీ గురువారం రాత్రి భద్రాచలంలో జరిగిన ముఖ్యమైన ఆత్మీయుల ఆంతరంగిక సమావేశంలో వెంకట్రావును ఈసారి గెలిపించు కోవాలని చెప్పి పలు సూచనలు చేసినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొనగా వెంకట్రావు సోదరి, దుమ్మగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, మరికొందరు ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.

వెంకట్రావు ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న కారణంగా మరికొంత కాలం విశ్రాంతి అవసరమని పొంగులేటి చెప్పి భద్రాచలం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని మార్చి నెలకి వాయిదా వేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచేగాక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే అవకాశాలు ఉన్నందున భద్రాచలంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలోనే భారీ చేరికలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇకపై దృష్టంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనే పెట్టి ప్రచారంచేసి సమస్యలతో అసంతృప్తిగా ఉన్న వారికి దగ్గర కావాలని పొంగులేటి తన అనుచరులకు సూచించారు. ఈసారి వెంకట్రావు విజయం ఖాయమని పొంగులేటి ధీమాగా చెప్పినట్లు సమాచారం.



Next Story

Most Viewed