సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందు : ప్రభుత్వ విప్ కాంతారావు

by Disha Web Desk 15 |
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందు : ప్రభుత్వ విప్ కాంతారావు
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు. పేదల, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు వినూత్న, విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ బంగారు తెలంగాణ ఫలాలను అట్టడుగు వర్గాలకు చేరువచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల కుటుంబ సభ్యులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఐదు దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాల ఫలితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజును నేడు పండుగగా జరుపుకుంటున్నామన్నారు. ఈ ఉత్సవాలు రాష్ట్ర చరిత్రలో ఓ గొప్ప వేడుకలుగా నిలిచిస్తాయని చెప్పారు. నేటి నుండి 21 రోజులు పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించారు. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటున్నట్టు తెలిపారు. 2 వందల కోట్లతో సీతమ్మ సాగర్‌ బహుళార్ధ ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. కాంక్రీటు పనులు చురుకుగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి అయినట్లు తెలిపారు. గోదావరి వెంబడి నివాసాలు ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదలు అధికంగా నివసిస్తున్న జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కి, జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిదులకు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story