అనర్హులకు ప్రభుత్వ పథకాలు.. తప్పుడు పత్రాలు మంజూరు చేస్తూ అధికారి దోపిడీ!

by Dishanational4 |
అనర్హులకు ప్రభుత్వ పథకాలు.. తప్పుడు పత్రాలు మంజూరు చేస్తూ అధికారి దోపిడీ!
X

దిశ, వైరా: తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా అనర్హులకు ప్రభుత్వ పథకాలు మంజూరు అవుతున్నాయి. అర్హులు మాత్రం ఈ పథకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి కేంద్రంగా ప్రభుత్వ అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. కాసులు ఇస్తే తప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఓ అధికారి మంజూరు చేస్తున్నారు. ఆ ఆదాయ ధృవీకరణ పత్రం ఆధారంగా భూస్వాములు కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పొందుతున్నారు. దీంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.

అర్హులైన వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంజూరు అయ్యేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధ్రువీకరణ పత్రాలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల విచారణ చేసే అధికారి ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొంది. మండలం ప్రజలు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన అధికారి కోసం పడి కాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తమ పనులపై ప్రజలు సదరు అధికారికి ఫోన్ చేసిన కనీసం లిఫ్ట్ చేయని పరిస్థితి. కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆ అధికారి ధనవంతుల వద్ద అందిన కాడికి దండుకొని తప్పుడు ధ్రువీకరణల పత్రం మంజూరు చేసి.. వాటి ఆధారంగా ప్రభుత్వ పథకాలు కేటాయిస్తున్నారు.

ఆ అధికారిని ఏసీబీకి పట్టించాలంట!

వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి అవినీతి అక్రమాలపై ఆ కార్యాలయంలోని ఉన్నతాధికారి తప్పు చేస్తే ఏసీబీకి పట్టించాలంటూ సలహా ఇవ్వడం విశేషం. తహసీల్దార్ కేంద్రంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిపై ఆ కార్యాలయంలోని ఉన్నతాధికారిని వివరణ కోరగా.. చేతనైతే ఏసీబీకి పట్టించండి.. లేదంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండని ఉచిత సలహా ఇచ్చారు. తన పర్యవేక్షణలో నడిచే తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు మాత్రం ఆ అధికారి ఎందుకు ప్రయత్నించడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో నిరుపేదల అసైన్మెంట్ భూములకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారంలో తహసీల్దార్ కార్యాలయంలోని ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడిన విషయం సదరు ఉన్నతాధికారికి ఇంతవరకు తెలియదా అనే విషయం చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల మంజూరు వివాదాస్పదంగా మారుతుంది.

ఈ సర్టిఫికెట్ ఆధారంగా ఓసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండటంతో ఒక్కో ధ్రువీకరణ పత్రానికి 10వేల నుంచి 20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అనర్హులకు కేటాయించి సదరు అధికారి అందని కాడికి దండుకుంటున్నారు. అనర్హులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు చేయటంతో అర్హులు ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు గత ఆరు నెలలుగా సదరు అధికారి మంజూరు చేసిన ఆదాయ, ఈడబ్ల్యూఎస్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎంతమంది అనర్హలు ఆ జాబితాలో ఉన్నారో ప్రత్యక్షంగా స్పష్టమవుతుంది. తన కార్యాలయంలో జరిగే తప్పులను సరిదిద్దుకోవాల్సిన ఓ ఉన్నతాధికారి సదరు అధికారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆ అధికారి మంజూరు చేసిన ధ్రువీకరణ పత్రాలు, కల్యాణ లక్ష్మి పథకాలపై ఉన్నతాధికారుల సమగ్ర విచారణ చేసి, దుర్వినియోగం అవుతున్న ప్రభుత్వ నిధులను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story