పొంగులేటి.. ఎక్కువగా ఊహించుకోకు.. : తాత మధు

by Dishanational1 |
పొంగులేటి.. ఎక్కువగా ఊహించుకోకు.. : తాత మధు
X

దిశ, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగానే వివిధ పార్టీల నుంచి అనేకమంది బీఆర్ఎస్ లో చేరారని, అంతేగానీ తన వల్లే ఖమ్మం జిల్లాలో చేరికలు జరిగాయని, పార్టీ పటిష్టంగా మారిందని పొంగులేటి అనడం విడ్డూరంగా ఉన్నదని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు అన్నాడు. మంగళవారం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా ఆ ఒక్కసారి కూడా యాధృచ్చికంగా మాత్రమే గెలిచాడని సెటైర్ వేశాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన స్థాయి కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నాడని, ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నడని దుయ్యబట్టాడు. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరిట పినపాక, ఇల్లెందు, మధిరలో సమావేశాలు నిర్వహించి పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నాడు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న క్రమంలో ప్రజలకు స్పష్టత ఇస్తున్నామని మధు తెలిపాడు.

నీ తోటకు కరెంటు రావడంలేదా?

కల్లూరులో నీకు 40 ఎకరాలు మామిడితోట ఉంది.. ఆ తోటకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత కరెంటు నీవు వాడుకోవడం లేదా? కోట్ల రూపాయలకు అధిపతి వైన నీవు ఒక్కపైసా అయినా కడుతున్నావా? అంటూ తాత మధు ఫైర్ అయ్యాడు. కరెంటు వస్తుందా? లేదా? అన్న విషయమై నేను కల్లూరు వస్తా.. వెళ్దామా ? అంటూ బహిరంగ సవాల్ విసిరాడు. అనేక వేదికల మీద 24 గంటలు కరెంటు ఇస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని పొగిడిన నీవు.. ఈ రోజు విమర్శించడంలో అర్థం లేదని విలేకరుల సమావేశంలో పొంగులేటి మాటలను ఆధారాలతో సహా చూపించాడు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీఆర్ఎస్ లలో రాజకీయ పబ్బం గడుపుకుని, ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నావని దుయ్యబట్టాడు. పొంగులేటికి రాజకీయ స్టెబిలీటీ లేదని, డబ్బుతోటి దేన్నయినా కొనవచ్చనే ఆలోచనలో ఉన్నాడని విమర్శించాడు. ధన రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ.. జిల్లా రాజకీయాలను పొంగులేటి కలుషితం చేశాడని మధు ఆరోపించారు.

షర్మిలను పాలేరుకు తెస్తుంది నీవేనా?

నీ మాటలు, వ్యవహారశైలి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలపిస్తుందని, ఆ పార్టీతో ఉన్న లోపాయికారి సంబంధాల వల్లే షర్మిలను పాలేరుకు తీసుకువస్తున్నావా? అంటూ వ్యాఖ్యానించారు. షర్మిల మాటలు, నీ మాటలు ఒకే తీరుగా ఉంటున్నాయని, అందుకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నావని అన్నాడు. నియోజకవర్గాల్లో తిరగాలంటే పాస్ పోర్టు, విసా కావాలా? అని మాట్లాడుతున్నావ్.. నీలాగే షర్మిల కూడా మాట్లాడుతుంది ఇద్దరు కుమ్మక్కు అయి బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నాడు. వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీకి నష్టం చేశావని, 'నచ్చితే గెలిపిస్తే.. నచ్చక పోతే ఓడిస్తా' అనే పాలసీని పెట్టుకుని పార్టీకి చాలా నష్టం చేశావని ఫైర్ అయ్యాడు. వివిధ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థుల ఓటమికి ప్రత్యక్ష కారణం పొంగులేటి అని ధ్వజమెత్తాడు. పోయినసారి ఆయన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినా ఎందుకు గెలువలేదని? వారి ఓటమికి ఎవరు కారణమని మధు ప్రశ్నించాడు.

ఆధారాలతో ముందుకు వస్తాం..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలో చేరాడని, పార్టీ నుంచి వ్యక్తిగతంగా అనేక లబ్ధి పొందాడని తాత మధు అన్నాడు. సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలతో బహిర్గతం చేస్తామని చెప్పాడు. 2014 కు ముందు నీ ఆర్థిక స్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి? అని ప్రశ్నించాడు. బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా మిగతావారికి డబ్బు సహాయం చేయడం, మాట సహాయం చేయడం పొంగులేటి పరిపాటిగా మారిందని, ఈ క్రమంలోనే పార్టీ తనకు అన్యాయం చేసిందని గగ్గోలు పెడుతున్నాడని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం నీ కుట్రను అర్థం చేసుకున్నదని, అందుకే జిల్లా నాయకులందరం కలిసికట్టుగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ నీరజ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కొందబాల కోటేశ్వరరావు, చింతనిప్పు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed