రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకే ప్రాధాన్యత: తాత మధు

by Dishanational1 |
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకే ప్రాధాన్యత: తాత మధు
X

దిశ, వైరా: "రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారు... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీలతోపాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీలో కూడా సమ ప్రాధాన్యతతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.... కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేటాయించిన విధంగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది... రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మాదిరిగానే వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా సొంత పాలకవర్గమైన వైరా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం... త్వరలో వైరాకు ఖమ్మం మాదిరిగానే రిజర్వాయర్ పై ట్యాంక్ బండ్ మంజూరు కానుంది" అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అభివృద్ధిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయమై దిశ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధును వివరణ కోరింది.

ఈ సందర్భంగా తాత మధు మాట్లాడుతూ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఏమి మాట్లాడారో తనకు సమాచారం లేదన్నారు. కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తమ అభిప్రాయాన్ని వెళ్లబుచ్చితే తాను ఆ విషయాలపై స్పందిస్తానన్నారు. వైరా, ఇల్లందు, సత్తుపల్లి, మధిరతోపాటు అన్ని మున్సిపాలిటీలకు సమకేటాయింపులతో నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ విజ్ఞప్తి మేరకు ఎస్డీఎఫ్ నిధులు 50 కోట్ల రూపాయలను నియోజకవర్గంలోని వ్యవసాయ రోడ్ల అభివృద్ధికి మంజూరు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. అన్ని మున్సిపాలిటీలతోపాటు వైరా మున్సిపాలిటీకి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. వైరాలో ఇప్పటికే ప్రభుత్వం ఇండోర్ స్టేడియం నిర్మాణం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టిందని వివరించారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలతోపాటు వైరా మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ 30 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని గుర్తుచేశారు.

జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వైరా మున్సిపాలిటీకి రూ. 30 కోట్ల నిధులు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో లాగానే వైరా మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని వివరించారు. తమ పార్టీ పాలకవర్గం ఉన్న వైరా మున్సిపాలిటీను కచ్చితంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. అందుకు కావలసిన ప్రణాళికలను వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్, జిల్లా మంత్రి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో తయారుచేసి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఆ నిధులను మంజూరు చేయించుకుంటామన్నారు. ఖమ్మం ట్యాంక్ బండ్ మాదిరిగానే వైరా రిజర్వాయర్ పై ట్యాంక్ బండ్ ను ప్రభుత్వం నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు. మున్సిపాలిటీలో సమస్యల ప్రాధాన్యత బట్టి అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపడుతుందని వివరణ ఇచ్చారు.



Next Story

Most Viewed