అధికారులపై చర్య తీసుకోండి : కౌన్సిలర్ల ఫిర్యాదు

by Disha Web Desk 15 |
అధికారులపై చర్య తీసుకోండి :  కౌన్సిలర్ల ఫిర్యాదు
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్ కు కౌన్సిలర్లు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. వైరా మున్సిపాలిటీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఫిబ్రవరి 22వ తేదీన 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విధితమే. వైరా మున్సిపాలిటీ చైర్మన్ ఒకటో వార్డులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని ఆ ఫిర్యాదులో కౌన్సిలర్లు పేర్కొన్నారు. కౌన్సిలర్ల ఫిర్యాదుతో అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ తన లాగిన్ లో చైర్మన్ ఇంటి అనుమతులు తీసుకున్నారా...? లేదా..? అని పరిశీలించారు.

ఈ పరిశీలనలో ఇంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టమైంది. తాము ఫిర్యాదు చేసిన అనంతరం ఫిబ్రవరి 23వ తేదీన అధికారులు చైర్మన్ చేసిన ఇంటి అనుమతుల దరఖాస్తును ఆగ మేఘాల మీద పరిశీలించి అనుమతులు మంజూరు చేశారని కౌన్సిలర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఫిర్యాదు చేసిన విషయం తెలిసిన తర్వాత కూడా అధికారులు ఇంటి అనుమతులు మంజూరు చేయటం నిబంధనలకు విరుద్దమేనని ఫిర్యాదులో వివరించారు. వైరా తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ తహసీల్దార్ రాము, అప్పటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇటుకల భాస్కర్, వైరా ఇన్చార్జి కమిషనర్ బి.అనిత హడావుడిగా అనుమతులు మంజూరు చేశారని ఫిర్యాదులో స్పష్టం చేశారు.

సామాన్య ప్రజలకు ఇంటి అనుమతులు ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెట్టే అధికారులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసి కూడా ఇంటి అనుమతులు మంజూరు చేయడంతో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని కౌన్సిలర్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కౌన్సిలర్లు కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో మొత్తం 13 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. తాజాగా అధికారులపై కలెక్టర్ కు కౌన్సిలర్లు ఫిర్యాదు చేయడంతో మరోసారి వైరా మున్సిపాలిటీ వ్యవహారం చర్చనీయాంశమైంది.



Next Story

Most Viewed