కేటీఆర్ సెటైర్లను ఆయనకే గుర్తుచేస్తున్న స్థానికులు... నెట్టింట్లో వైరల్

by Dishanational1 |
కేటీఆర్ సెటైర్లను ఆయనకే గుర్తుచేస్తున్న స్థానికులు... నెట్టింట్లో వైరల్
X

దిశ, వైరా: "నా ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు... ఆయన సంక్రాంతి పండుగకు పక్క రాష్ట్రానికి పోయారు... ఆయనకు అక్కడ తోటలు, ఇల్లు ఉన్నాయి... పోయివచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు... కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి... మీ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు ప్రజలను పంపించండి... అన్నాడు... సార్ ఎందుకు అని నేను అడుగగా... నేను అక్కడ నాలుగు రోజులు సంక్రాంతికి ఉన్న... కరెంటు, నీళ్లు లేవు... రోడ్లు అయితే ధ్వంసం అయిపోయి ఉన్నాయి... రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి... మళ్లీ తిరిగి వచ్చిన తర్వాతే నాకు ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది" అని తన ఫ్రెండ్ చెప్పినట్లు సరిగ్గా సంవత్సరం క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లపై సెటైర్లు వేశారు... అయితే ప్రస్తుతం అలాంటి సెటైర్లే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని తెలంగాణ ప్రాంత ప్రజలు వేస్తుండటం విశేషం..


ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లే వైరా - మధిర ప్రధాన రహదారి గత రెండేళ్లగా గుంతలమయంగా మారి ప్రమాదకరంగా తయారైంది. ఈ రోడ్డుపై ప్రయాణం వానచోదుకులకు, ప్రయాణికులకు నరకంగా మారింది. ఈ రోడ్డును చూసిన ప్రతి ఒక్కరూ గతంలో కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇది ఏ రాష్ట్రంలో రోడ్డు మంత్రి కేటీఆర్ గారు అంటూ తిరిగి సెటైర్లు వేస్తున్నారు... ఈ రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులు, వాహన చోదకులు రెండేళ్లకుపైగా నానా అవస్థలు పడుతున్నా కనీసం ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోవడం లేదు. బీటీ రెన్యువల్ దేవుడెరుగు... రోడ్డుపై పడిన గుంతలను పూడ్చేందుకు కూడా ఆర్ అండ్ బీ అధికారులు కనీస చొరవ చూపటం లేదు. ఇటీవల అధ్వానంగా ఉన్న ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని బీఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని సంకేతాలు ఇస్తున్న సీపీఎం పార్టీ ఆధ్వర్యంలోనే భారీ స్థాయి ఆందోళన, రాస్తారోకో చేశారు. అయినా ఆర్ అండ్ బీ అధికారుల్లో కనీస చలనం కరువైంది.


ఇది వైరా - మధిర రోడ్డు దుస్థితి...

వైరా నుంచి మధిరవెళ్లే రోడ్డులో అడుగడుగునా మోకాళ్ళ లోతు గుంటలు దర్శనమిస్తున్నాయి. వైరాలోని ఇందిరమ్మ కాలనీ నుంచి తాటిపూడి గ్రామం వరకు రోడ్డు మరింత భయంకరంగా ఉంది. అదేవిధంగా జింకల గూడెం, రెబ్బవరం, గొల్లపూడి, పాలడుగు గ్రామ సమీపంలో కూడా ఈ రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాద భరితంగా ఉంది. ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ప్రయాణించే పరిస్థితి లేదు. భారీ వాహనాలు కూడా ఈ రోడ్డుపై ప్రయాణించి దెబ్బతింటున్నాయి. ఏడాది కాలంలో ఈ గుంటల రోడ్డు వల్ల సుమారు నలుగురు మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి ఈ రోడ్డు నిదర్శనంగా నిలుస్తుంది.

రూ. 4 కోట్ల నిధులు మంజూరై ఆరు నెలలు....

అధ్వానంగా ఉన్న వైరా - మధిర ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం ప్రభుత్వం ఆరు నెలల క్రితం సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తోంది. అయినా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మత్తు పనులు నేటికీ చేపట్టలేదు. దీంతో ప్రమాదాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. రెడ్ గ్రావెల్ తాము ఆశించిన ధరకు లభించడంలేదనే ఒక్క కారణంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంలేదు. పనులు ప్రారంభించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులల్లో కనీస చలనం కరువైంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా తాత్కాలిక మరమ్మతులు చేయాలనే ఆలోచన కూడా ఆర్ అండ్ బీ అధికారుల్లో కొరవడింది. ప్రస్తుత రోడ్డు స్థితిని చూసి గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుని స్థానికులు ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్ అండ్ బీ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వైరా మధిర ప్రధాన రహదారి మరమ్మత్తులు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలని వానచోదకులు ప్రయాణికులు కోరుతున్నారు.


Next Story